ఆర్భాటం ఎక్కువ.. అభివృద్ధి తక్కువ | Buggana Rajendranath Comments On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

ఆర్భాటం ఎక్కువ.. అభివృద్ధి తక్కువ

Published Thu, Jul 18 2019 3:45 AM | Last Updated on Thu, Jul 18 2019 5:08 AM

Buggana Rajendranath Comments On Chandrababu Govt - Sakshi

సాక్షి, అమరావతి: తమ బడ్జెట్‌లో ఎక్కడా గందరగోళం లేదని, అంతా స్పష్టంగా తేటతెల్లంగానే ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌పై టీడీపీ పక్షం చేసిన వాదనను తిప్పికొట్టారు. బడ్జెట్‌పై రెండు రోజులుగా శాసనసభలో జరిగిన చర్చకు మంత్రి బుగ్గన బుధవారం సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వ పాలనంతా మ్యాటర్‌ తక్కువ, పబ్లిసిటీ ఎక్కువన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం శాసనసభ్యులు లేవనెత్తిన వాటికి అంశాల వారీగా సూటిగా సమాధానం చెప్పారు. తాము ఎక్కడా పన్నులు పెంచలేదని, గతంలో కన్నా తగ్గించామన్నారు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కూడా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వోట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కన్నా తక్కువేనని వివరించారు. గత ఫిబ్రవరిలో చంద్రబాబు ప్రభుత్వం రూ.2,26,177 కోట్లతో వోట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెడితే తమ ప్రభుత్వం 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.2,27,974.99 కోట్లతో ప్రతిపాదించామన్నారు. వ్యవసాయ బడ్జెట్‌లో ఎందుకు తేడా వచ్చిందని టీడీపీ వాళ్లు ప్రశ్నిస్తున్నారని, వాళ్లు బడ్జెట్‌ ప్రతిని సరిగా చదివితే విషయం బోధ పడుతుందన్నారు.  ద్రవ్యలోటుపై టీడీపీ వారిది అర్థం లేని ఆందోళన అంటూ.. 2015–16లో 3.58 శాతం, 2016–17లో 4.42 శాతం, 2017–18లో 4.03 శాతం, 2018–19లో 3.67 శాతం ఉంటే 2019–20లో 3.26 శాతమే ఉందని వివరించారు. వడ్డీలేని రుణాలకు కేటాయింపులు వచ్చే బడ్జెట్‌లో భారీ ఎత్తున ఉంటాయన్నారు.  

రూ.40 వేల ఆదాయం ఉన్న వారికి కూడా ఆరోగ్యశ్రీ 
తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న వాటిలో 80 శాతం హామీల అమలుకు మొదటి ఏడాదిలోనే శ్రీకారం చుట్టామని మంత్రి బుగ్గన తెలిపారు. మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని వివరించారు. పశువులతో పాటు గొర్రెలకు కూడా ఈ ఏడాది నుంచే ఉచిత బీమా పథకాన్ని అమలు చేసేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. రూ.40 వేల ఆదాయం ఉన్న వారికి కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నట్టు సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. పింఛన్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తాము అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. టీడీపీ హయాంలో ఐటీ పరిశ్రమలు తీసుకు రాకుండానే తాము అడ్డుకుంటున్నామని ఆ పార్టీ నేతలు గగ్గోలు పెట్టడం సరికాదన్నారు. జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రశంసిస్తున్నామంటూనే అర్థం పర్థం లేని విమర్శలు చేయవద్దని విపక్షానికి సలహా ఇచ్చారు. చంద్రబాబు చేపట్టిన నీరు–చెట్టు పథకానికి నాలుగేళ్లలో రూ.793.36 కోట్లు కేటాయించి రూ.4,850 కోట్లు దోచేశారని ఆరోపించారు.    

స్పీకర్‌ ఆగ్రహం.. సభ వాయిదా
బుగ్గన ప్రసంగం ముగిశాక ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు లేచి బడ్జెట్‌పై మళ్లీ మాట్లాడబోగా సభలో స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఈ దశలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ గత ఐదేళ్ల బడ్జెట్‌ సమావేశాలలో ఎన్నడూ ఇలా జరగలేదని, ఆర్థిక మంత్రి వివరణ తర్వాత మళ్లీ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన సందర్భం ఎప్పుడూ లేదన్నారు.  ఈ దశలో అచ్చెన్నాయుడు స్పీకర్‌ను ఉద్దేశించి అనకూడని మాట అనడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభను గురువారం నాటికి వాయిదా వేశారు. 

దేశ దేశాలు తిరిగి చివరకు రాజమౌళికి..
అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించలేదని విపక్షం వాపోతోందని, వాస్తవానికి చంద్రబాబు కన్నా తామే ఎక్కువగా నిధులు కేటాయించామని బుగ్గన చెప్పారు. రాజధాని నిర్మాణాల పేరిట చంద్రబాబు, ఆయన బృందం తిరగని దేశం లేదని, ప్రత్యేక విమానాల్లో మలేషియా, సింగపూర్, జపాన్, కొరియా, శ్రీలంక, లండన్, కజకిస్తాన్‌.. ఇలా ఎన్నో దేశాలు తిరిగారని చెప్పారు. ఇలా ఎక్కడికి పోయినా అక్కడి మాదిరిగా నిర్మాణాలు ఉండాలంటూ అమరావతిని భ్రమరావతిగా మార్చి చివరకు రాజమౌళికి అప్పగించారని ఎద్దేవా చేశారు. రాజధాని అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం గత ఐదేళ్లలో ఖర్చు పెట్టింది కేవలం రూ.277 కోట్లయితే తాము ఈ బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించామని వివరించారు. హైదరాబాద్‌ నగరంలో అత్యంత ఖరీదైన గచ్చిబౌలి, నానక్‌రాం గూడాలో చదరపు అడుగు నిర్మాణం రూ.5 వేలకు మించి లేదని, కిటికీలు కూడా లేకుండా అమరావతిలో నిర్మించిన భవనాలకు చదరపు అడుగుకు రూ.12 వేలు వెచ్చించారన్నారు. 

పెన్షనర్లకు మధ్యంతర భృతి
పెన్షనర్లకు కూడా మధ్యంతర భృతి ఇస్తామని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రెండు రోజుల్లోగా జారీ చేస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతిని ఇచ్చామన్నారు. కాగా ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిల ప్రశ్నకు సమాధానంగా విజయవాడ, జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ అతిథి గృహాలు, పర్యాటక శాఖ అతిథి గృహాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు వసతి సౌకర్యం, రాయితీలు కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తామని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement