సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్లింది ఐక్యరాజ్యసమితి సదస్సుకు కాదని, ఎస్‌ఐఎఫ్‌ఎఫ్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ(ఎన్జీవో) ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనేందుకే వెళ్లారని ప్రజాపద్దుల కమిటీ(పీఎసీ) ఛైర్మన్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. చంద్రబాబు అమెరికా పర్యటనపై మీడియా అధికంగా హడావుడి చేసిందని అన్నారు. బుగ్గన ఆదివారం హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఐక్యరాజ్యసమితి సదస్సుకు భారతదేశానికి ఆహ్వానం అందలేదని, భారత్ నుంచి ప్రతినిధి బృందం కూడా హాజరు కాలేదని బయట పడిందన్నారు. ఎస్‌ఐఎఫ్‌ఎఫ్ అనే ఎన్జీవో, ఐరాస అనుబంధ పర్యావరణ విభాగం, విదేశీ వాణిజ్య బ్యాంకు ఉమ్మడిగా నిర్వహించిన సదస్సుకు చంద్రబాబు హాజరయ్యారని పేర్కొన్నారు.
ఎస్‌ఐఎఫ్‌ఎఫ్ కార్యాలయం న్యూఢిల్లీలోని లోడీ ఎస్టేట్‌లో ఉందని, దానికి అనుబంధంగా గుంటూరు జిల్లా గోరంట్లలో ఒక పరిశోధనా కేంద్రం ఉందని తెలిపారు. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే...
‘‘చంద్రబాబు పాల్గొన్న సదస్సుకు ముందుగా న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి సేద్యం గురించి ప్రచురితమైన ఒక వ్యాసంలో... ఏపీలో సాగును మరింత అభివృద్ధి చేసేందుకు రూ.16,600 కోట్ల పెట్టుబడులు కావాలని పేర్కొన్నారు. వాణిజ్య బ్యాంకుల నుంచి రుణ సేకరణకు ఏపీ ప్రభుత్వం–అక్కడి బ్యాంకులకు మధ్య సమన్వయకర్తగా ఉంటామని ఆ వ్యాసంలో ఎస్‌ఐఎఫ్‌ఎఫ్ ప్రకటించింది. వాస్తవానికి ఈ వ్యాసం జూన్ 26న ప్రచురితమైంది. ఈ సదస్సును సెప్టెంబర్‌లో ఎస్‌ఐఎఫ్‌ఎఫ్ నిర్వహించింది. ఒక పద్ధతి ప్రకారం అంతర్జాతీయ పత్రికలో వ్యాసం రాయించి, సదస్సు నిర్వహించేలా ముందస్తుగా ఏర్పాటు చేసుకుని, అమెరికా ఆహ్వానం మేరకు ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రసంగం అంటూ ఎల్లో మీడియాలో ఊదరగొట్టడం సిగ్గుచేటు.
అధిక వడ్డీలకు అప్పులు తెస్తారా?
చంద్రబాబు పుణ్యమా అని రాష్ట్ర అప్పులు రూ.97 వేల కోట్ల నుంచి రూ.2.5 లక్షల కోట్లకు పెరిగాయి. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపైనా రూ.40,000 అప్పు భారం పడింది. ఒక్కో కుటుంబంపై అప్పు రూ.1.5 లక్షలకు చేరింది. బాబు హయాంలోనే రూ.1.5 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్రంపై మరింత భారం వేయడానికి ప్రకృతి వ్యవసాయం పేరుతో చంద్రబాబు రూ.16,600 కోట్ల అప్పు కోసం అమెరికా వెళ్లారు. అమరావతి బాండ్ల తరహాలోనే అధిక వడ్డీకి రుణాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
డబ్బు పంచి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు
ప్రకృతి సేద్యంపై చంద్రబాబు చేసిన ప్రసంగాల్లో, అధికారిక ప్రకటనల్లో విచిత్రమైన వివరాలున్నాయి. ఏపీలో 60 లక్షల మంది రైతులు 2 కోట్ల ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని చేపట్టబోతున్నట్లు, ఒక డాలర్ పెట్టుబడికి 13 డాలర్ల లాభాన్ని చూసి ఐటీ రంగ ఉద్యోగులు కూడా ఈ తరహా సేద్యం వైపు మళ్లుతున్నారని చంద్రబాబు ప్రకటించారు. పైసా పెట్టుబడి లేకుండా కేవలం గోమూత్రం, ఆవు పేడతో సేద్యం చేయడం సాధ్యమయ్యే పనేనా? 2020 నాటికి 17 లక్షల మంది ప్రకృతి సేద్యం చేస్తారని చంద్రబాబు చెప్పారు. అసలు ఏపీలో క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ప్రకృతి సేద్యం గురించి ప్రభుత్వంలో ఉన్న వారే ఒక్కో విధంగా చెబుతున్నారు.
చంద్రబాబు ఓ విధంగా, వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మరో విధంగా ప్రకటనలు చేస్తున్నారు. 1.63 లక్షల మంది రైతులు లక్షన్నర ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారని వ్యవసాయ బడ్జెట్‌లో చంద్రమోహన్ పేర్కొన్నారు. 1.30 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం సాగుతోందని 2017–18 సోషియో ఎకనామిక్ నివేదికలో ప్రభుత్వం వెల్లడించింది. అసలు ప్రకృతి సేద్యానికి సంబంధించిన శాస్త్రీయమైన గణాంకాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయా? సీడ్ సర్టిఫికేషన్ సెంటర్ ఉందా? బడ్జెట్ కేటాయింపు ఉందా? రాయితీల సదుపాయం ఉందా? చంద్రబాబు అమెరికా సదస్సుకు వెళ్లి ప్రకృతి సేద్యంపై ఎందుకు బాకా ఊదారంటే.. రూ.16,600 కోట్ల రుణాన్ని సేకరించి, ఆ డబ్బును జనానికి పంచి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నారు. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం అమల్లో ఉంది. దీనివల్ల కర్నూలు జిల్లా మేకలు, గొర్రెలు తెలంగాణ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. వీటిని ఆపే దిక్కు లేదు గానీ ప్రకృతి సేద్యంపై చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుండడం దారుణం’’ అని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment