సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై ఆయన అనుకూల మీడియా చేస్తున్న హడావుడి హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు వెళ్లాల్సిన సదస్సుకు రాష్ట్ర ఆర్థిక మంత్రిని వెంటబెట్టుకొని ముఖ్యమంత్రి వెళ్లడం ఎంతవరకు సమర్థనీయమని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు లభిస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక చంద్రబాబు ఇలాంటి గిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. బుగ్గన శుక్రవారం హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆరుసార్లు సింగపూర్ పర్యటనకు వెళ్లారని, ప్రధానమంత్రి మోదీ తర్వాత ఎక్కువ విదేశీ పర్యటనలు చేసింది ఆయనేనని చెప్పారు. బాబు విదేశీ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఏం ఒరిగిందో చెప్పాలని నిలదీశారు.
అమరావతిలో అద్భుతాలు సృష్టించారట!
‘‘పెట్టుబడులు పెట్టే అవకాశం కోసం సింగపూర్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ ప్రపంచ నగరాల సదస్సు నిర్వహించింది. నగర మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు మాత్రమే హాజరు కావాల్సిన స్థాయి ఉన్న ఆ సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లడం ఆశ్చర్యంగా ఉంది. డబ్బులు ఖర్చు పెట్టుకుని మేయర్లు, చైర్మన్లు ఎవరైనా వెళ్లొచ్చు. అలాంటిది మన ముఖ్యమంత్రి మాత్రమే సింగపూర్ సదస్సుకు వెళ్లారని ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం దారుణం. అర్థం కాని రీతిలో మాట్లాడే కళ చంద్రబాబుకే సొంతం, ఇంకెవరికీ అది సాధ్యం కాదు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేసే పరిస్థితి వచ్చిందని చెబుతాడు, ఎవరైనా మహిళలు మాఫీ కాలేదంటే కోపంగా చూస్తాడు.
ఇంకా మొదలే పెట్టని నిరుద్యోగ భృతిని పరిమితి లేకుండా అందరికీ ఇచ్చేసినట్లు చెబుతాడు. దాన్ని ఆయన అనుకూల మీడియా అదే పనిగా ప్రచారం చేస్తోంది. చంద్రబాబు సింగపూర్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూ విచిత్రంగా ఉంది. అమరావతిలో అద్భుతాలు సృష్టించినట్టు భ్రమలు కల్పించారు. రాష్ట్ర రాజధానిలో 15 నిమిషాల్లోనే పని ప్రదేశం నుంచి ఇంటికి వెళ్లొచ్చని, 1,400 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ ఉందని, వాకింగ్ పాత్ ఉందని, గార్డెన్ సిటీ ఉందని, అంతా విద్యుత్ వాహనాలే వాడుతున్నామంటూ అరచేతిలో స్వర్గం చూపించారు. అమరావతిలో వర్షం పడితే బయటి కంటే లోపలే నీళ్లెక్కువగా ఉండే తాత్కాలిక భవనాలు, ఇప్పుడిప్పుడే వేసే రోడ్లు తప్ప ఏమైనా ఉన్నాయా? తప్పుడు ప్రచారంతో ఏం సందేశం పంపాలనుకుంటున్నారు?’’ అని బుగ్గన ధ్వజమెత్తారు.
ఎవరి వల్ల ఎవరికి లాభం?
‘‘నూతన రాజధాని ఏర్పాటుపై చట్టం ప్రకారం శివరామకృష్ణన్ కమిటీని నియమిస్తే, ఆ నివేదికను కనీసం అసెంబ్లీలో చర్చకు కూడా పెట్టలేదు. సమాంతరంగా నారాయణ కమిటీని వేశారు. అందులో వ్యాపారవేత్తలను నియమించుకున్నారు. రాజధాని నగరాన్ని ఎక్కడ నిర్మిస్తారో తెలిజేయకుండా గందరగోళం సృష్టించారు. అమరావతిలో అధికారపార్టీ నేతలు ముందే భూములు కొనేశారు. రాజధానిలో ప్రైవేటు సంస్థలకు ఎకరా రూ.50 లక్షలకు కేటాయించి, ప్రభుత్వ సంస్థలకు ఎకరా రూ.కోటి ధర నిర్ణయించారు. స్విస్ చాలెంజ్ పేరుతో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు 1,691 ఎకరాలు అప్పగించారు. ఆ ప్రాజెక్టులో సింగపూర్ కంపెనీలకు 58 శాతం, ఏపీకి 42 శాతం వాటా ఇవ్వడం న్యాయమేనా? ఇంటి అల్లుడి మాదిరి అంతా రాసిస్తే సింగపూర్ వాళ్లు సంతోషంగానే ఉంటారు.
జైపూర్‌లో 17 ఎకరాల్లో, కర్నాటకలో 127 ఎకరాల్లో రాజధానిని నిర్మిస్తే, ఇక్కడ వేలాది ఎకరాలు ఎందుకు? అసలు సింగపూర్ వల్ల ఏపీకి లాభమేంటి? ఏపీ వల్ల సింగపూర్‌కు లాభమేంటి? సింగపూర్‌కు దోచిపెట్టిన చంద్రబాబు సమాధానం చెప్పాలి. లోపాయికారీ ఒప్పందాలు లేకుండానే ఇవన్నీ చేశారా? చంద్రబాబు విదేశీ పర్యటనలు వెళ్లినప్పుడల్లా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని వెంట తీసుకెళ్లడంలో ఆంతర్యమేంటి? ఆయన రావడం వల్ల ధైర్యం వస్తుందా? ఏపీలో ఉండటం వల్ల ఏదైనా భయమేస్తుందా?’’ రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు.
అవినీతిలో ఏపీకి రెండోస్థానం
‘‘సులభతర వాణిజ్యంలో ఏపీ నెంబర్‌వన్ స్థానంలో ఉందంటూ అదేపనిగా ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎవరో ఓర్వడం లేదని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేయడం విడ్డూరంగా ఉంది. 2017 గణాంకాలను పరిశీలిస్తే... దేశం మొత్తమ్మీద రూ.71,500 కోట్ల పెట్టుబడులు వస్తే, ఏపీకి వచ్చింది రూ.4,500 కోట్లు మాత్రమే. సులభతర వాణిజ్యంలో పదో స్థానంలో ఉన్న మహారాష్ట్రకు అదే సంవత్సరంలో రూ.40,500 కోట్లు పెట్టుబడులు రాగా, మూడో స్థానంలో ఉన్న హరియాణాకు పెట్టుబడులే రాలేదు. 8వ స్థానంలో ఉన్న కర్ణాటకకు రూ.1.90 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ఈ ఏడాది జనవరి నుంచి మే వరకూ చూసినా.. మహారాష్ట్ర రూ.19 వేల కోట్లు, గుజరాత్ రూ.16 వేల కోట్లు, ఉత్తరప్రదేశ్ రూ.11 వేల కోట్లు, పశ్చిమ బెంగాల్ రూ.6 వేల కోట్లు, జార్ఖండ్ రూ.4,276 కోట్లు, తెలంగాణ రూ.4,128 కోట్లు, నాగాలాండ్ రూ.3,761 కోట్లు, రాజస్థాన్ 3,415 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ.3,103 కోట్ల పెట్టుబడులను సాధించాయి. ప్రత్యేక హోదా ఉండబట్టే నాగాలాండ్‌కు మనకన్నా ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ నివేదిక ప్రకారం అవినీతిలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. సీఎంఎస్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం 2017లో అవినీతిలో ఏపీ రెండో స్థానంలో ఉంది. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పాలనాపరంగా ఘోరంగా విఫలమయ్యారు’’ అని బుగ్గన దుయ్యబట్టారు.
చంద్రబాబువన్నీ గిమ్మిక్కులే
Published Sat, Jul 14 2018 2:41 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment