సీబీఐ అంటేనే బాబుకు భయం  | Bhuggana Rajendranath comments on Chandrababu | Sakshi
Sakshi News home page

సీబీఐ అంటేనే బాబుకు భయం 

Published Sat, Nov 17 2018 4:45 AM | Last Updated on Sat, Nov 17 2018 4:45 AM

Bhuggana Rajendranath comments on Chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చట్టాలను ఉల్లంఘించడం, వ్యవస్థలను భ్రష్టుపట్టించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పేరు చెబితేనే చంద్రబాబు వణికిపోతున్నారని, తప్పు చేయకపోతే ఆయనకు సీబీఐ అంటే అంత వణుకు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ విచారణకు వీలులేదంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 176 జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇది సమాఖ్య వ్యవస్థకు విఘాతం కల్గించడమేనన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాల యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రా జ్యాంగం ప్రకారం కేంద్ర జాబితాలో 97 అంశాలు, రాష్ట్ర జాబితాలో 67 అంశాలు, ఉమ్మడిజాబితాలో 46 అంశాలు ఉన్నాయి. సీబీఐ కేంద్ర జాబితాలో ఉంది. రాష్ట్ర పరిధిలో సీబీఐ ప్రవేశించరాదన్నారంటే ఆడిట్‌ చేయడానికి కాగ్, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్, కష్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ కూడా ఇక్కడ పనిచేయరాదంటారేమో?’ అని బుగ్గన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను శాఖ (ఐటీ) సోదాలు చేస్తుంటుందని, అందులో భాగంగా టీడీపీకి చెందిన ముగ్గురి ఆస్తులపై ఐటీ తనిఖీలు చేస్తే బాబు అండ్‌కో నానా యాగీ చేసిందన్నారు. రాజకీయ నాయకులు అక్రమార్జనపై తనిఖీలు చేయకూడదనేది బాబు విధానమా? అక్రమాలు చేసిన నాయ కులకు రక్షణ ఉండాలని చంద్రబాబు డిమాండ్‌ చేస్తున్నారా? అని నిలదీశారు. ఇదో కేన్సర్‌ వంటిదని బుగ్గన చెప్పారు. 

తప్పులు బయటపడతాయనే ఇలాంటి జీవోలు
ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటన దర్యాప్తును కేంద్ర ఏజెన్సీకి అప్పగిస్తారని, అదే జరిగితే సూత్రధారులు బయటపడతారని బాబు భయపడి సీబీఐ విచారణ జరపడానికి వీల్లేదని జీవో ఇచ్చారా? అని బుగ్గన ప్రశ్నించారు. ‘తన తప్పులు బయటపడతాయని భయపడే చంద్రబాబు ఇలాంటి జీవోలు తెస్తున్నారు. తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకోవాలి. చట్టం తనపని తాను చేసుకునే వెసులుబాటు ఉండాలి. సమాఖ్య వ్యవస్థలో అవసరాలకు అనుగుణంగా పలు చట్టాలను, సంస్థలను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కేంద్ర సంస్థలకు అధికారాలు లేవని ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా చంద్రబాబు ఏమి చేయబోతున్నారు? దేశ స్వాతంత్య్రం తర్వాత ఎవరూ చేయని పని చంద్రబాబు ఎందుకు చేశారు? కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడూ చంద్రబాబు చట్టాలను ఉల్లంఘించారు. వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేశారు. ఎమ్మెల్యేల్లో నలుగురిని మంత్రులుగా కూడా ప్రమాణం చేయించారు. ఇది రాజ్యాంగంలోని పదో షెడ్యూలును కాలరాయడమే’ అని బుగ్గన మండిపడ్డారు. 

కేంద్రం మౌనం వల్లే ఈ పరిణామం
విచ్చలవిడిగా అప్పులు చేయడంవల్ల జరిగే అనర్థాలను నివారించడం కోసం కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం తెచ్చిందని బుగ్గన చెప్పారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించి చంద్రబాబు సర్కారు అప్పులు చేసిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా శివరామకృష్ణన్‌ కమిటి రాజధానిపై నివేదిక ఇస్తే కనీసం చట్టసభల్లో దానిని ప్రవేశపెట్టలేదన్నారు. అప్పట్లో చంద్రబాబు ఎన్డీఏ భాగస్వామి కాబట్టి బీజేపీ కళ్లుమూసుకుందని, ఎన్డీయే సర్కారు ఆరోజు చేసిన పాపానికి ఈ రోజు మూల్యం చెల్లించుకుంటోందని విమర్శించారు. ఇప్పుడు బీజేపీతో విభేదించి కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినందునే చంద్రబాబు ఈ జీవో ఇచ్చారన్నారు. 2014లో టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఒక్కరిపైనా కూడా చర్యలు తీసుకోలేదని, డాక్యుమెంటరీ షూటింగ్‌ కోసం సాధారణ భక్తుల ఘాట్‌కు ముఖ్యమంత్రి వచ్చి 29 మంది దుర్మరణానికి కారకులయ్యారని మండిపడ్డారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement