సాక్షి, అమరావతి: గన్నవరం ఎయిర్‌పోర్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విమానాశ్రయ భద్రతా సిబ్బంది తనిఖీ చేసిన అంశంపై సోమవారం రాష్ట్ర శాసనసభలో ఆసక్తికర చర్చ జరిగింది. అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఆ తనిఖీలతో తమకు ఎలాంటి సంబంధంలేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించగా.. టీడీపీ సభ్యులు కరణం బలరాం, వాసుపల్లి గణేష్ తదితరులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనిపై ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జోక్యం చేసుకుని ప్రభుత్వ వైఖరిని వివరించారు.
టీ విరామం అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబును తనిఖీ చేస్తారా? అని టీడీపీ నేతలు గొడవ చేస్తున్నారని, వాళ్ల తీరు చూస్తుంటే పరమానందయ్య శిష్యుల కథ గుర్తుకు వస్తోందని అన్నప్పుడు కరణం బలరాం, వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు అభ్యంతరం తెలిపారు. సంప్రదాయాలు పాటించకుండా కించపరిచేలా మాట్లాడడం తగదన్నారు. దీనిపై అంబటి ఘాటుగా స్పందిస్తూ.. పరమానందయ్య శిష్యులు, నారా నందయ్య శిష్యులవల్లే బాబుకు ఎక్కువ నష్టం జరుగుతోందని చురకవేశారు. కరుణాకర్‌రెడ్డి కూడా ఈ ప్రస్తావన చేస్తూ.. చంద్రబాబు ఉంటున్న కరకట్టపై నుంచి సైకిల్‌పై వెళ్లినా ప్రస్తుతం ఆయనకు ముంచుకొచ్చే ప్రమాదమేమీలేదని, గతంలో మాదిరిగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రవాదమేమీ లేదన్నారు. ఆత్మన్యూనత, మెగలోమానియా (తన గురించి తాను ఎక్కువగా ఊహించుకోవడం) వంటి వాటితో టీడీపీ నేతలు బాధపడుతున్నారన్నప్పుడు టీడీపీ సభ్యుడు వి.గణేష్ అభ్యంతరం వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా భద్రతా రకాలు, వాటి తీరు తెన్నులను, దేశంలో ఎవరెవరికి ఏఏ భద్రతా కేటగిరీ ఉందో గణేశ్ వివరించారు. ఆ తర్వాత కరణం బలరాం మాట్లాడుతూ.. సెక్యూరిటీపై తమకు కొంత అవగాహన ఉందని, ఏ సోషల్ మీడియాలో ఏమి వచ్చిందో తమకు తెలియదని, తమ పార్టీ వారు ఎటువంటి ప్రచారం చేయలేదని, సోషల్ మీడియావల్లే చాలా అనర్ధాలు, నష్టాలు జరుగుతున్నాయన్నారు. ఈ దశలో బుగ్గన జోక్యం చేసుకుంటూ.. టీడీపీ సభ్యుడు మాట్లాడేదానికి చంద్రబాబు తనిఖీకి సంబంధం లేదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉంటే ఒక విధానం.. మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి జెడ్ ప్లస్‌లో ఉంటే మరో విధానం ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి.. చంద్రబాబును విమానాశ్రయంలో తనిఖీ చేసిన దానికి ఎటువంటి సంబంధంలేదని, ఎయిర్‌పోర్టు నిబంధనల ప్రకారమే బాబును తనిఖీ చేశారని స్పష్టంచేశారు. విమానాశ్రయాల్లో భద్రతాపరమైన తనిఖీలకు సంబంధించి మాజీ సీఎంలకు ఎలాంటి మినహాయింపులేదని.. చంద్రబాబును తనిఖీ చేయడంపై వాస్తవాలు తెలుసుకోకుండా రాద్ధాంతం సరికాదన్నారు.
ఆ తనిఖీతో మాకేంటి సంబంధం?
Published Tue, Jun 18 2019 4:31 AM | Last Updated on Tue, Jun 18 2019 4:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment