సాక్షి, అమరావతి : అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం జరిగిన ఘటనకు బాధ్యులైన సభ్యులు, సభ్యులు కానివారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాంకు అప్పగిస్తూ శాసనసభలో తీర్మానం చేశారు. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులో ఈ ఘటనపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని బుగ్గన విమర్శించారు. ప్లకార్డులు తీసుకురాకూడదన్నది సభ రూల్స్‌లో ఉందని గుర్తుచేశారు. చంద్రబాబు పెట్టిన అసెంబ్లీ ద్వారాలు.. ఆయనకే కారాగారంలా కన్పిస్తున్నాయా అని ఎద్దేవా చేశారు. బుగ్గన ప్రవేశపెట్టిన తీర్మానానికి వైఎస్సార్‌సీపీ సభ్యులు జక్కంపూడి రాజా, గొల్లపూడి బాబురావు, అంబటి రాంబాబు, అప్పలరాజు, వరప్రసాద్ బలపరిచారు.
చంద్రబాబుకు స్పీకర్ సూచన..
అంతకుముందు స్పీకర్ మాట్లాడుతూ.. నిన్న జరిగిన దృశ్యాలు సభలో అందరు చూశారని.. చంద్రబాబు మాటల్లో అన్ పార్లమెంటరీ పదాలు ఉన్నాయని తెలిపారు. ఇది పార్లమెంటరీ వ్యవస్థకు మంచి కాదని హితవు పలికారు. అసెంబ్లీలో హుందాగా వ్యవహరించాలని.. ఆవేశంగా మాట్లాడితే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. సభ్యులు కానివారు అసెంబ్లీ ఆవరణలోకి వచ్చినట్టు గుర్తిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డీజీపీని ఆదేశించారు.
ఈ సందర్భంగా స్పీకర్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వారి ప్రవర్తనపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎవరిపైన ద్వేషం లేదని స్పష్టం చేశారు. మార్షల్స్‌ను వారి వాదనలు చెప్పాల్సిందిగా కోరినట్టు వెల్లడించారు. మార్షల్స్, పోలీసులు సభ్యులకు భద్రత కల్పించేందుకే ఉన్నారని తెలిపారు. అరాచక శక్తుల ద్వారా సభకు ఇబ్బంది కలగవద్దని సూచించారు. చంద్రబాబు గౌరవంగా ఈ ఎపిసోడ్‌కు ముగింపు పలకాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు.
ఈ తీర్మానం బలపరిచే సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుతో తలవంచుకునేలా ఉన్నాయని మండిపడ్డారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే నిన్నటి ఘటన జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు ఆయన రావాల్సిన గేటు నుంచి కాకుండా మరో గేటు నుంచి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. గొల్ల బాబురావు మాట్లాడుతూ.. చంద్రబాబుకు ప్రభుత్వ ఉద్యోగులంటే చులకన భావం అని తెలిపారు. నిన్నటి సంఘటన అధికారులకు జరిగిన అవమానంగా భావిస్తున్నట్టు చెప్పారు. 70 ఏళ్ల వయసు వచ్చినా చంద్రబాబులో ఎలాంటి మార్పు లేదని విమర్శించారు.
అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు సభలో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. సభలో మాట్లాడకూడని పదాలు కూడా ఆయన మాట్లాడుతున్నారని తెలిపారు. చేసిన తప్పుపై విచారం వ్యక్తం చేయమంటే.. టీడీపీ సభ్యులు సభను పక్కదోవ పట్టిస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాల్సిందేనని కోరారు. సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. సానుభూతి కోసం చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే చంద్రబాబు క్షమాపణలు చెప్పడం లేదని వ్యాఖ్యానించారు. వరప్రసాద్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment