ప్యాపిలిలో మాట్లాడుతున్న ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి
సాక్షి, ప్యాపిలి/డోన్: తాము టీడీపీ నేతల మాదిరి మోసం చేసే వాళ్లం కాదని.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సారిగా ఆదివారం ఆయన ప్యాపిలి పట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం స్థానిక కొత్త బస్టాండ్ ఎదురుగా నిర్వహించిన సభలో బుగ్గన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు పాదర్శకంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రతి పనికీ సర్‌చార్జ్ వసూలు చేశారన్నారు. కందులు, శనగలు కొనుగోలులో రైతుల నుంచి ఖాళీ సంచులు కూడా వదిలిపెట్టలేదన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులను సైతం భోంచేసిన ఘనత టీడీపీ నాయకులకే దక్కిందన్నారు. అధికారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారన్నారు.
ప్యాపిలి బహిరంగ సభకు హాజరైన ప్రజలు
ఈ పరిస్థితులను చూసి నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలను పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు. నీతి, నిజాయతీతో కూడిన పాలన అందించాలన్న తపనతో నియోజకవర్గంలోని అన్ని కార్యాలయాల్లో చిత్తశుద్ధి కలిగిన అధికారులను నియమించామన్నారు. కేకే (కోట్ల, కేఈ కుటుంబాల)ల పాలనలో డోన్ నియోజకవర్గం ఈ 50 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేకపోయిందన్నారు. అభివృద్ధి అంటే ఏమిటో ఈ ఐదేళ్లలో చేసి చూపుతామన్నారు. కార్యక్రమంలో ప్యాపిలి, డోన్ జెట్పీటీసీ సభ్యులు దిలీప్ చక్రవర్తి, శ్రీరాములు, మండల నాయకులు బోరెడ్డి శ్రీరామిరెడ్డి, రాజా నారాయణమూర్తి, గౌసియాబేగం, వెంకటేశ్వరరెడ్డి, బోరా మల్లికార్జునరెడ్డి, బషీర్, శ్రీనివాసరెడ్డి, సీమ సుధాకర్ రెడ్డి, జంగం చంద్రశేఖర్, కమతం భాస్కర్ రెడ్డి, బోరెడ్డి పుల్లారెడ్డి, సోమశేఖర్, రామచంద్రారెడ్డి, కొండయ్య, ఎస్‌కే వలి, జలదుర్గం రసూల్, రమేశ్ రెడ్డి, ఇమాముద్దీన్, రమేశ్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నీటి సమస్యను గాలికొదిలారు
గత పాలకులు డోన్ పట్టణంలో నీటి సమస్యను గాలికి వదిలేశారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన మండి పడ్డారు. మున్సిపల్ కమిషనర్ కేఎల్‌ఎన్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం డోన్‌లో మునిసిపాలిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ పాలకవర్గం మంచినీటి పంపిణీ వ్యవస్థపై నిర్లక్ష్యం వహించిందన్నారు. భవిష్యత్తులో మంచినీటి సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలను తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. డోన్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో కొత్త బోర్లు వేయాలని, పాత బోర్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను ఏర్పాటు చేయాలని మంత్రికి వైఎస్సార్‌సీపీ నాయకులు కోట్రికె పద్మజ, చిన్నకేశవయ్య గౌడ్, కోట్ల హరిశ్చంద్రారెడ్డి విన్నవించారు. సమీక్షలో మాజీ జడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం ఎస్‌ఈ శ్రీనివాస రెడ్డి, ఈఈ రామ్మోహన్ రెడ్డి, డీఈ నాగభూషణం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment