నాగలి గుర్తును చూపుతున్న రాఘవులు
కామారెడ్డి టౌన్: తమది 70 ఏళ్ల ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్.. కూటమిగా ఏర్పడే దుస్థితికి దిగజారిందని, ఇక రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. శనివారం బీఎల్‌ఎఫ్ కామారెడ్డి అభ్యర్థి పుట్ట మల్లికార్జున్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన.. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్, టీడీపీలే ప్రధాన కారణమని చెప్పారు. టీడీపీకి రాష్ట్రంలో అసలు ముఖం కూడా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణగా మారుస్తానన్న కేసీఆర్.. కనీసం వెండి తెలంగాణను కూడా చేయలేదని, మట్టి తెలంగాణ చేస్తున్నాడని మండిపడ్డారు.
లౌకికవాదానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్న టీఆర్‌ఎస్.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక పాల నను ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని, రఫేల్ కుంభకోణం తదితర అంశాలపై స్పందించకుండా తాను లౌకకవాదినని కేసీఆర్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు కావాలంటే రాజ్యాంగం మార్చాలని, ఆ దిశగా కేసీఆర్ ప్రయత్నం చేయకుండా మైనారిటీలను ఓట్లకోసం మోసం చేస్తున్నారని విమర్శించారు. సామాజిక న్యాయం, లౌకికవాద పరిరక్షణ కోసం ప్రత్యామ్నాయంగా ఏర్పడిన బీఎల్‌ఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment