‘కాగ్‌ నివేదిక భగవద్గీత కాదు’ | CAG Report is Not A Bhagwat Geeta Says Harish Rao | Sakshi
Sakshi News home page

‘కాగ్‌ నివేదిక భగవద్గీత కాదు’

Published Tue, Apr 3 2018 2:03 AM | Last Updated on Tue, Mar 19 2019 5:47 PM

CAG Report is Not A Bhagwat Geeta Says Harish Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నివేదికపై కాంగ్రెస్‌ అతిగా వ్యవహరిస్తోందని, కోడిగుడ్డుపై ఈకలు పీకిన చందంగా అనవసర ఆరోపణలు చేస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాగ్‌ నివేదికను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్‌ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడూ కాగ్‌ నివేదికలను అప్పటి ప్రభుత్వాలు తప్పుపట్టిన సంగతిని గుర్తు చేశారు.

‘కాగ్‌’నివేదిక ఏమైనా భగవద్గీత, బైబిల్‌ లేదా ఖురానా కాదు కదా అని హరీశ్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డితో పాటు కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య మంత్రివర్గాల్లో పని చేసిన సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒకసారి ఆ ముఖ్యమంత్రులు అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఆత్మావలోకనం చేసుకుంటే బాగుండేదన్నారు. ప్రభుత్వం నుంచి సకాలంలో వివరణలు వెళ్లకపోవడం వల్ల కాగ్‌ కొన్ని చర్యలను తప్పుపడుతుందే కానీ అదే నిజం కాదన్నారు. కాగ్‌ లేవనెత్తిన సందేహాలను నివృతి చేస్తే ఆ సమస్య పరిష్కారమవుతుందన్నారు. అధికారంలో ఉన్నపుడు ఒక మాట, అధికారం పోయినప్పుడు మరో మాట మాట్లాడటం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు.  

మాజీ ప్రధాని మన్మోహనే చెప్పారు. 
కాగ్‌ నివేదికలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అన్నారని హరీశ్‌ గుర్తుచేశారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న సమయంలో రూ.23 వేల కోట్ల అవినీతి జరిగిందని కాగ్‌ చెప్పిందని, అయితే కాగ్‌ నివేదికను పట్టించుకోవద్దని అప్పట్లోనే మోదీ అన్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా పలు లోపాలను కాగ్‌ ఎత్తిచూపిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక రకంగా, తమ రాష్ట్రాల్లో మరో రకంగా కాగ్‌ నివేదికలు ఇచ్చిందని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటున్నారని చెప్పారు.

అప్పులను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టుబడిగా చూపించి, తెలంగాణలో మాత్రం అప్పులుగా కాగ్‌ చూపుతోందని హరీశ్‌ అన్నారు. తెలంగాణలో అవినీతి జరుగుతోందని కాగ్‌ ఎక్కడా చెప్పలేదని, సాంకేతిక అంశాలపై మాత్రమే ప్రభుత్వాన్ని కాగ్‌ తప్పుపట్టిందన్నారు. అప్పులను, పెట్టుబడులను లెక్కిస్తున్నపుడు పరిగణనలోకి తీసుకుంటున్న అంశాలపై సీఎం కేసీఆర్‌ గతంలోనే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జెట్లీకి లేఖను రాశారని హరీశ్‌ గుర్తుచేశారు. 

అనేక అంశాల్లో కాగ్‌ మెచ్చుకుంది..
ప్రభుత్వాన్ని అనేక అంశాల్లో కాగ్‌ మెచ్చుకుందని, అవి కాంగ్రెస్‌ నేతలకు కనబడటం లేదని హరీశ్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతల విమర్శలు గురివింద గింజ సామెతలా ఉన్నాయన్నారు. బస్సు యాత్రలో కాంగ్రెస్‌ నేతలు అధికార దాహంతో హామీలు గుప్పిస్తున్నారని, ఇక్కడ కాంగ్రెస్‌ నేతలు ఇస్తున్న హామీలను ఇప్పటికే ఆ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీవి ఆపద మొక్కులేనని, కాంగ్రెస్‌ నేతలు చేస్తున్నది బస్సుయాత్ర కాదని, అధికార యావ యాత్ర అని విమర్శించారు.

బస్సు యాత్ర వేదికపై నాయకులు ఎక్కువ, సభలో జనాలు తక్కువగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై ప్రజలకు పూర్తి విశ్వాసముందన్నారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ నేతలను బస్సు యాత్రలో ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు హరీష్‌ పిలుపునిచ్చారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement