
న్యూఢిల్లీ/పట్నా: బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్‌కు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్‌ఎస్‌జీ) కల్పిస్తున్న జడ్‌ప్లస్ భద్రతను కేంద్రం ఉపసంహరించింది. ఇకపై ఆయనకు జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తారు. కేంద్రం తీరుపై లాలు, ఆయన ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సామాజిక న్యాయం, మత సామరస్యం కోసం తాను చేస్తున్న పోరాటాన్ని ఆపేసేలా కేంద్రం బెదిరించడానికి కుట్ర పన్నుతోందని లాలు ఆరోపించారు. తనకేమైనా అయితే నితీశ్ కుమార్, మోదీ ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలని అన్నారు.
దిగజారుడుతనమే: తేజస్వి
తన తండ్రిని హతమార్చడానికి కుట్ర జరుగుతోందని, ఆయనకు ఏమైనా అయితే మోదీ తోలు వలుస్తామని లాలు కొడుకు తేజ్ ప్రతాప్ హెచ్చరించారు. కావాలంటే తాను మాట్లాడింది వెళ్లి మోదీకి చెప్పుకోవచ్చని మీడియాతో అన్నారు. తన తండ్రికి భద్రతను కుదించడం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు అద్దంపడుతోందని లాలు చిన్న కొడుకు తేజస్వి యాదవ్ అన్నారు. ఆర్జేడీ చేస్తున్న ఆరోపణలపై బిహార్ ఉపముఖ్య మంత్రి సుశీల్ మోదీ స్పందిస్తూ...ప్రజలు లాలుకు భయపడుతుంటే ఆయన దేనికి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.