ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దలు చెబుతారు.. రాజకీయాలకూ ఈ మాట వర్తిస్తుంది.. సొంత నియోజకవర్గంలో గెలవడం ద్వారా తామేమిటో నిరూపించుకోవాలని భావిస్తారు.. కానీ, సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ తీరే వేరు.. ఇంట గెలవలేరు కానీ ‘జన్మభూమి’ అంటూ ప్రచారాలు చేసుకుంటారు. బాలయ్య తీరూ అలానే ఉంది.. నాడు ‘అన్నయ్య’ చిరంజీవి.. నేడు ‘తమ్ముడు’ పవన్ కూడా సొంత ఊరంటే ఆమడ దూరం జరుగుతున్నారు..
సాక్షి, అమరావతి: 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు రాజకీయంగా సొంత నియోజకవర్గం చంద్రగిరి పేరెత్తితేనే వణుకు పుడుతుంది. 1983లో ఓటమి అనంతరం అటువైపు కన్నెత్తి చూడనే లేదు. నాలుగు దశాబ్ధాలుగా కుప్పంలో పోటీచేస్తున్నారు. చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లె.. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఉంది. కాంగ్రెస్ నుంచి 1978లో చంద్రగిరి నుంచే పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి పరాజయం పాలయ్యారు. సొంత మామపైనే పోటీ చేస్తానంటూ బీరాలు పలికి నెల రోజులకే టీడీపీలో చేరిపోయారు. 1989లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎన్టీరామారావు సూచించగా.. చంద్రబాబు ససేమిరా అన్నారు. కుప్పంకు వలసెళ్లి అక్కడే పోటీచేస్తున్నారు. ఎన్టీ రామారావును కుట్రతో గద్దె దింపి తాను సీఎం అయిన తర్వాత కూడా చంద్రబాబు చంద్రగిరి వైపు చూడలేకపోయారు. ఆయన 1995లో సీఎం అయ్యాక ఇంతవరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో ఒక్కసారి కూడా టీడీపీ గెలవనేలేదు.
నాన్నారూ.. చంద్రగిరి వద్దు..
సొంత నియోజకవర్గం నుంచి పోటీకి లోకేశ్‌కూ హడలే. చంద్రబాబు తరం కాలేదు. కానీ నారా కుటుంబ నవతరం నాయకుడు అని చెబుతున్న లోకేశ్ అయినా తమ సొంత నియోజకవర్గం చంద్రగిరిలో పోటీ చేయకపోతారా అని టీడీపీ శ్రేణులు ఊహించాయి. కానీ లోకేశ్ కూడా చంద్రగిరి అంటే ససేమిరా అన్నారు. అసలు ప్రత్యక్ష ఎన్నికలు అంటేనే లోకేశ్‌కు భయం. అందుకే దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి.. మంత్రి పదవి చేపట్టారు. ఇక 2019లో కూడా పోటీ చేయకపోతే విలువుండదని గ్రహించి తప్పనిసరి పరిస్థితుల్లో లోకేశ్ ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధపడ్డారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాలను పరిశీలించి సర్వేలు నిర్వహించి ఎట్టకేలకు మంగళగిరిని ఎంపిక చేశారు.
గుడివాడలో తొడగొట్టని బాలయ్య ..!
సందర్భం ఏదైనా.. విషయం ఏదైనా సరే నందమూరి వంశం పేరు చెప్పి గొప్పలు చెప్పడం.. సినిమాల్లో వీరావేశంతో తొడలు కొట్టడం బాలకృష్ణకు బాగా అలవాటు. కానీ బాలయ్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేసరికి తమ సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో తొడకొట్టేందుకు మాత్రం సాహసించడంలేదు. నందమూరి కుటుంబం సొంత ఊరు నిమ్మకూరు కృష్ణా జిల్లాలో ఉంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు అంటే 2009 వరకు నిమ్మకూరు గుడివాడ నియోజకవర్గంలో ఉండేది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత జరిగిన 1983, 1985 ఎన్నికల్లో గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. గుడివాడ నియోజకవర్గంలో అత్యధిక భాగం అందులోనే కొనసాగింది. నిమ్మకూరు మాత్రం పామర్రు(ఎస్సీ రిజర్వుడు) నియోజకవర్గ పరిధిలోకి చేరింది. కాగా దశాబ్ధాలుగా ఉన్న బంధుత్వాలు, అనుబంధంతో పాటు ఎన్టీ రామారావుకు ఉన్న రాజకీయ బంధం దృష్ట్యా గుడివాడే నందమూరి కుటుంబానికి సొంత నియోజకవర్గంగా అంతా గుర్తిస్తారు. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో బాలయ్య గుడివాడ నుంచి కాకుండా హిందూపురంకి వలస వెళ్లారు.
తమ్ముడుదీ అన్నయ్య దారే
మెగా ఫ్యామిలీ సొంత ఊరు మొగల్తూరు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ఉంది. కానీ నాడు అన్నయ్య చిరంజీవి గానీ నేడు తమ్ముడు పవన్ కల్యాణ్ గానీ నరసాపురం నుంచి పోటీ అంటేనే ప్యాకప్ అంటున్నారు. మార్పు తీసుకువస్తానని ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి 2009 ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నరసాపురం నుంచి పోటీచేసేందుకు సాహసించలేదు. ఎందుకంటే సినిమాల్లోకి వెళ్లిన సొంత ఊరికి పిసరంత ప్రయోజనం చేకూర్చలేదు. అందుకే నరసాపురం నుంచి కాకుండా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు, చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి పోటీ చేశారు. పాలకొల్లులో ఓడిపోయారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీ స్థాపించిన తమ్ముడు పవన్‌కల్యాణ్ 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. దాంతో ఆయనైనా నరసాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారా లేదా అన్న ఆసక్తి వ్యక్తమైంది. కానీ సినీ పవర్ స్టార్ కూడా అన్నయ్య చిరంజీవి దారిలోనే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్నం జిల్లా గాజువాక నుంచి పోటీచేయాలని నిర్ణయించారు. సొంత ఊరు నుంచి అసెంబ్లీకి పోటీ అంటే మెగా బ్రదర్స్ కూడా భయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment