సాక్షి, అమరావతి: రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కంటే తానే సీనియర్ అని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిచోటా సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. ఆఖరికి ఉన్నతాధికారులనూ వదలడం లేదు. చంద్రబాబు నాయుడు మరోసారి తనకు అలవాటైన విద్యను ప్రదర్శించారు. శుక్రవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ వేదికగా తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని పరిస్థితుల గురించి, ప్రభుత్వ కార్యక్రమాల అమలు గురించి కలెక్టర్లతో చర్చించాల్సింది పోయి రాజకీయ ఉపన్యాసం ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల ప్రచార విశేషాలను సమావేశంలో ఏకరువు పెట్టారు. హైదరాబాద్ ప్రగతి, అభివృద్ధి, పురోగతి తన వల్లే జరిగిందని అన్నారు. సైబరాబాద్ సృష్టికర్తను తానేనని కలెక్టర్లకు ఉద్భోద చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎం తమతో చర్చిస్తారని భావించిన కలెక్టర్లు చంద్రబాబు ప్రసంగంతో విస్తుపోయారు. అత్యున్నత స్థాయి అధికారుల సమావేశంలో రాజకీయ ఉపన్యాసం ఏమిటంటూ అక్కడున్నవారు గుసగుసలాడుకున్నారు.
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తనపై తప్పుడు ప్రచారం చేస్తుంటే నిజాలు చెప్పాల్సిన బాధ్యత తనపైనే ఉందని చంద్రబాబు అన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు అని తనవేనని వ్యాఖ్యానించారు. తాను తీసుకున్న చర్యల వల్లే తెలంగాణకు హైదరాబాద్ పెద్ద ఆస్తిగా మారిందని గొప్పలకు దిగారు. ఇంకా విచిత్రంగా ప్రతిసారి తనను విమర్శించే కేసీఆర్.. సీఎం అయ్యాక ఏం కట్టారని కలెక్టర్లను ప్రశ్నించారు. సీఎం అలా మాట్లాడుతుంటే ఎలా స్పందించాలే అర్థం కాక కలెక్టర్లు.. ఫామ్‌హౌస్ తప్ప ఏం కట్టలేదంటు వివరణ ఇచ్చారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై అధికారులు, రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సొంత డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబే తర్వాతే ఎవరైనా అంటూ జనం జోకులు వేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆయన మారరంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment