సీఎం చంద్రబాబు నాయుడు
అనంతపురం: ‘తెలుగువారు ఎక్కడున్నా బీజేపీని ఓడించాలంటూ నేను పిలుపునివ్వడంతోనే కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. అందుకు నేను చాలా సంతోషిస్తున్నా’ అని సీఎం చంద్రబాబు అన్నారు. నీరు–ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని తురకలాపట్నం చెరువులో సీఎం జలహారతి ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ బీజేపీ తనపై కుట్ర చేస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో బ్యాంకులపై నమ్మకం పోతోందన్నారు. దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఏపీ మొదటిస్థానంలో నిలిచిందని, దీనిపై చర్చించడానికి తాను ఎక్కడైనా సిద్ధమని సవాల్ విసిరారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదంటే కూడా వినకుండా ముందుకు వెళ్లడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు.
సర్పంచ్ కాని వారూ విమర్శిస్తున్నారు
మొన్నటిదాకా మనల్ని పొగిడి ఈరోజు యూటర్న్ తీసుకుని విమర్శలు చేస్తున్నారని పవన్‌కల్యాణ్‌ను ఉద్ధేశించి సీఎం వ్యాఖ్యానించారు. కనీసం సర్పంచ్ కూడా కాని వారు తమను విమర్శిస్తున్నారన్నారు. తాను చేస్తున్న ధర్మపోరాటానికి మద్ధతు పలకాలని కోరారు.
వదంతులు బదులు వర్ధంతులన్న సీఎం
సీఎం చంద్రబాబు సభలో మాట్లాడుతూ.. ‘నిన్నా మొన్న చూస్తే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో దొంగలు వస్తున్నారంటూ కొందరు వర్ధంతులు సృష్టించారంటూ’ చెప్పుకొచ్చారు. వదంతులు అనాల్సింది పోయి వర్ధంతులు అని నోరుజారారు. అయితే ఈ పదాన్ని పదేపదే మూడుసార్లు ఉచ్చరించడంతో వేదికపై కూర్చున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కంగుతిన్నారు. అయినా సీఎం మాత్రం తన ప్రసంగంలో మునిగిపోయారు. చివరకు మంత్రి కాలువ తేరుకుని ఓ చిన్న పేపరులో రాసుకుని వచ్చి ముఖ్యమంత్రికి అందజేశారు. ఆ కాగితాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ‘ఇదివరకే చెప్పాను వదంతులు, రూమర్స్’ ఎక్కడికక్కడే ఇస్తున్నారంటూ సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు. సభకు హాజరైన టీడీపీ కార్యకర్తలు మాత్రం చినబాబు(లోకేష్) జయంతిని వర్ధంతి అని సంబోధిస్తే, పెదబాబు వదంతిని వర్ధంతి అంటూ సంబోధించారని చర్చించుకోవడం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment