చంద్రబాబు తదితరులను బస్సులో తరలిస్తున్న పోలీసులు
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బుధవారం విజయవాడలోని అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం వద్ద హైడ్రామాకు తెరలేపారు. బెంజ్‌సర్కిల్ వద్దనున్న వేదిక కళ్యాణ మండపం వద్ద కార్యాలయం ప్రారంభోత్సవానికి బుధవారం సాయంత్రం మాజీ సీఎం వచ్చారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జేఏసీ నేతలతో కలసి ఆటోనగర్ వద్ద బస్సు యాత్రను ప్రారంభించేందుకు బెంజిసర్కిల్ నుంచి పాదయాత్రగా బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండా పాదయాత్రగా వెళ్లడానికి వీల్లేదని, సాయంత్రం వేళ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని పోలీసు అధికారులు వివరించారు.
బస్సుయాత్రకు కూడా అనుమతి లేని విషయాన్ని స్పష్టంచేశారు. అనుమతి తీసుకుని యాత్ర ప్రారంభించాలని సూచించారు. అయితే వారి మాటను పెడచెవిన పెట్టి చంద్రబాబు సహా నేతలు వాగ్వాదానికి దిగారు. ఆటోనగర్ వెళ్తామంటూ మంకుపట్టు పట్టారు. పోలీసులపై మాజీ సీఎం తీవ్రస్థాయిలో బెదిరింపు ధోరణిలో విరుచుకుపడ్డారు. అనంతరం చంద్రబాబు, ఇతర నేతలు బెంజిసర్కిల్ వద్ద రోడ్డుపైనే బైఠాయించారు. పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించి తమపై దౌర్జన్యం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎంతమందిని అరెస్టు చేస్తారో చేసుకోవాలని సవాలు విసిరారు. పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేసినా వినిపించుకోకుండా మొండిగా రోడ్డుపైనే బైఠాయించారు.
స్తంభించిన ట్రాఫిక్..
చంద్రబాబు, ఇతర నేతలు బెంజిసర్కిల్‌లో బైఠాయించడంతో గంటన్నరపాటు ట్రాఫిక్ స్తంభించింది. ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలించారు. చంద్రబాబుతో పోలీసు అధికారులు పలుమార్లు చర్చించినా ఫలితం లేకపోవడంతో ప్రతిపక్ష నేత, జేఏసీ నేతలతోపాటు మాజీ మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలను పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనంలో తరలించారు. చంద్రబాబు, లోకేష్‌లను ఇంటి వద్ద దింపేశారు. మిగిలిన నేతలను వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. కాగా, బెంజిసర్కిల్ వద్ద చంద్రబాబు నిరసనకు దిగడంతో నగర కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment