చంద్రబాబు గగ్గోలుకు ఆంతర్యం ఏమిటో? | Chandrababu Making Baseless Allegations On Electric Buses Tenders | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఆరోపణలల్లో ఆంతర్యం ఏమిటి?

Published Fri, Sep 27 2019 2:52 PM | Last Updated on Fri, Sep 27 2019 2:52 PM

Chandrababu Making Baseless Allegations On Electric Buses Tenders - Sakshi

సాక్షి, అమరావతి: ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లపై చంద్రబాబు నాయుడు అండ్‌ కంపెనీ చేస్తున్న క్విడ్ ప్రోకో కట్టుకథే అని తేలిపోతోంది. తాను చేస్తే పారదర్శకత, పక్కన వాళ్లు చేస్తే అంతా అవినీతే అంటూ ఊదరగొట్టడం టీడీపీ అధినేతకు అలవాటే. తాజాగా ఎలక్ట్రిక్‌ బస్సుల టెండర్ల విషయంలోనూ అదే విధంగా వ్యవహరిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ సర్కారు బస్సులు నేరుగా కొనేసి కోట్లరూపాయలు అవినీతికి పాల్పడుతుందంటూ అడ్డగోలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే..ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపై రై రై మంటూ పరుగులెట్టాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్ర సర్కారు పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పెరుగుతోన్న కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు, పెట్రోలియం ఉత్పత్తులకుప్రత్యామ్నాయం ఉండాలనే ఉద్దేశ్యంతో. దీంతో అన్ని రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ బస్సులు 'లీజ్ పద్ధతి'లో తీసుకుని నడిపేందుకు రూ. 3545కోట్లు కేటాయించింది. దేశమంతటా 64 నగరాల్లో ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు నిధులతో పాటు టెండరింగ్ విధానం, నిర్వహణ పద్ధతులు, ఉన్నత స్థాయి స్క్రీనింగ్ కమిటీ మార్గదర్శకాలు కేంద్రమే విడుదల చేసింది. 

అంతేకానీ ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేసే అధికారం, హక్కు, విధానమే లేదు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఫేమ్‌-2 పథకంలో 350 బస్సులు మాత్రమే మంజూరయ్యాయి. సెప్టెంబర్ 26న ఏపీఎస్‌ ఆర్టీసీ నిర్వహించిన ప్రీ బిడ్‌ సమావేశంలో 18 సంస్థలకు సంబంధించిన 27 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అక్టోబర్ 14న ఫైనాన్షియల్ బిడ్ తెరవనున్నారు. ఇందులో ఈ-బస్సుల ఉత్పత్తి, తయారీ సంస్థలైన ఒలెక్ట్రాతో పాటు టాటా, అశోకా లైలాండ్‌, మహేంద్ర మొదలైన సంస్థలు  పాల్గొన్నాయి.

కేవలం 'లీజు పద్ధతి'లో మాత్రమే టెండర్ విధానంలో విద్యుత్ బస్సుల నిర్వహణ ఉంటుంది. అలాంటిది రాష్ట్రాలకు ఎలాంటి స్వేచ్ఛ, అధికారాలు లేకపోయినప్పటికీ చంద్రబాబు ఏ ఉద్దేశంతో చెబుతున్నారో.  మేఘా నుంచి క్విడ్‌ ప్రోకో పద్ధతిలో బస్సుల కొనుగోలు చేస్తున్నారంటూ రాష్ట్రాలకు లేని అధికారాన్ని ఆయన ఏకంగా సృష్టించి 'క్విడ్‌ ప్రోకో కొత్త నామకరణం' చేసేసి తెలుగుదేశం అధికారంలోన్న సమయంలో జరిగిన అక్రమాలు, అవినీతి, అవకతవకల నుంచి బయటపడేందుకు ఆరోపణలను తెరమీదకు తెస్తున్నారనే విషయం తేటతెల్లం అవుతోంది. అయితే రాష్ట్రానికి విద్యుత్ బస్సుల కొనుగోలు చేసే అధికారమే లేకుంటే ఎలా ఒలెక్ట్రా అమ్మకాలు సాధ్యమవుతాయనేది చంద్రన్న బ్యాచ్‌కు తెలియదేమో. 

మరోవైపు ఎలక్ట్రిక్‌ బస్సులపై నియమించిన ఆర్టీసీ నిపుణుల కమిటీ తన నివేదికను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించింది. ఈ విధానంపై కమిటీ కొన్ని కీలక సిఫార్సులు కూడా చేసింది. ఇంకా నిర్ణయం జరగకముందే ‘పచ్చ’  నేతలు క్విడ్‌ ప్రోకో అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018 మే 23న అమరావతిలో ఒలెక్ట్రా ఏసీ బస్సులలో ప్రయాణించి, ప్రశంసలు కూడా కురిపించారు. అంతేకాకుండా వివిధ నగరాల్లోనూ, తిరుమలు-తిరుపతి మద్య ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు పెద్దసంఖ్యలో కొనుగోలు చేస్తామని ప్రకటన కూడా చేశారు. తాజాగా ఏపీలోనే ఈ ఏడాది 7500 కోట్ల స్కామ్‌ జరుగుతోందంటూ ఆరోపించడంలో ఆంతర్యం ఏమిటి? అసలు తల తోక లేని ఆరోపణలు చూస్తుంటే చంద్రబాబుకు అందరూ అనుకుంటోన్న అల్జీమర్స్ ఉందేమో. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement