‘చంద్రబాబుకు పోలవరం బంగారు బాతు’ | Chandrababu naidu Dumped Polavaram Project for Commissions, says ysrcp | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుకు పోలవరం బంగారు బాతుగా మారింది’

Published Wed, Jan 17 2018 2:12 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

Chandrababu naidu Dumped Polavaram Project for Commissions, says ysrcp - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో తీవ్ర అవినీతి జరుగుతోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారి ప్రతినిధి పార్థసారధి ధ్వజమెత్తారు. టెండర్ల పేరుతో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.  ప్రాజెక్టుల పేరుతో దోచుకునేందుకు చంద్రబాబు దోపిడీ యజ్ఞానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. చంద్రబాబుకు పోలవరం బంగారు బాతుగా మారిందని పార్థసారధి వ్యాఖ్యానించారు. అంచనాలను విపరీతంగా పెంచి అవినీతికి పాల్పడుతున్నారన్నారు. కేంద్రం కూడా  ఇదే విషయాన్ని చెబుతోందన్నారు.

ఏడేళ్ల క్రితం రూ.10 వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిపాదనలు రూపొందిస్తే..దాన్ని ఇప్పుడు రూ.58 వేల కోట్లకు అంచనాలు పెంచి చంద్రబాబు దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టులో తీవ్ర అవినీతి జరుగుతుందని, జరగని పనిని జరిగినట్లు, ఇష్టారాజ్యంగా అంచనాలు పెంచి, అదనపు చెల్లింపులు కాంట్రాక్టర్లకు చెల్లించి ఈ ప్రాజెక్టును పెద్ద ప్రశ్నార్థం చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో అవసరమని, అలాంటి ప్రాజెక్టు మనుగడను చంద్రబాబు ప్రశ్నార్థం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య వ్యక్తి పోలవరంలో జరుగుతున్న దోపిడీపై నీతి అయోగ్‌ చైర్మన్‌కు లేఖ రాశారంటే చంద్రబాబు దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందన్నారు.

దోచుకోవడానికి ఒక ఆయుధంగా పోలవరాన్ని మలుచుకొని ఇష్టారాజ్యంగా అంచనాలు పెంచారని  మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును చంద్రబాబు తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా చంద్రబాబు ప్రధాని మోదీకి ఓ లేఖ ఇచ్చారని, అందులో అందరూ నిర్ఘాంతపోయేలా అంచనాలు పెంచారన్నారు. ఉద్దేశపూర్వకంగా పోలవరాన్ని వెనక్కి నెట్టి పురుషోత్తం పట్టణం, పట్టిసీమ తీసుకొచ్చి తన దోపిడీకి కొత్త అర్థాలు చెప్పారని విమర్శించారు. రైతాంగం చంద్రబాబు దోపిడీ గురించి అర్థం చేసుకోవాలన్నారు.

మొదట వైఎస్‌ఆర్‌ ధన యజ్ఞం చేశారని నాడు ప్రచారం చేశారని, ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో అంచనాలు పెంచిన చంద్రబాబుది ధన యజ్ఞం చేయడం వాస్తవం కాదా అని నిలదీశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక అంశాలపై ఆరోపణలు చేస్తే..వీటన్నింటిపైన వెనువెంటనే వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీబీఐ విచారణ చేయించారని గుర్తు చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే పోలవరంలో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధమా అని చంద్రబాబుకు పార్థసారధి సవాల్‌ విసిరారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో చంద్రబాబు మాటల్లో నీతి అంతే ఉంటుందన్నారు. సమ్మిట్ల పేరు మీద, ప్రధానిని కలిసే పేరు మీద నాగపూర్, పూనా, ఢిల్లీకి ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement