
ఇదేనా మీ నాయకత్వం? కనీసం 300 మంది కూడా రాలేదు.
సాక్షి, వైఎస్సార్ జిల్లా : దేశ ప్రధాని, రాష్ట్రపతి తదితర అత్యున్నత పదవులు అధిరోహించే వ్యక్తులను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించానంటూ గొప్పలు చెప్పుకొని కాలం వెళ్లదీసే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఘోర అవమానం జరిగింది. జాతీయ నాయకులను ప్రచారంలో దింపి డాబు ప్రదర్శిద్దామనుకుంటే కడప ప్రజలు ఆయనకు ఊహించని షాక్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ అధినేత ఫరూఖ్ అబ్దుల్లాను చంద్రబాబు ఆహ్వానించారు. ఈ క్రమంలో మంగళవారం నాటి కడప ఎన్నికల ప్రచారానికి ఆయన హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి స్పందన కరువైంది. కార్యకర్తలు, ప్రజలు కలిపి కనీసం 300 మంది కూడా హాజరుకాకపోవడంతో బాబు కంగుతిన్నారు. దీనిని అవమానంగా భావించిన ఆయన... టీడీపీ కడప ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇదేనా మీ నాయకత్వం అంటూ చిందులు తొక్కారు.
కాగా ఇంతకుముందు చంద్రబాబు, టీడీపీ నాయకులు నిర్వహించిన పలు సభల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చిన సంఘటనలు కోకొల్లలు. ఇలాంటి అనేక సందర్భాల్లో అనుకూల మీడియాతో సభలు సక్సెస్ అయినట్లుగా కలరింగ్ ఇచ్చేవారు. అయితే ఈసారి ఏకంగా ఓ పొరుగు రాష్ట్రం ముఖ్యనేత, మాజీ సీఎం ముందు అడ్డంగా దొరికిపోవడంతో చంద్రబాబు అండ్ కో ‘మేనేజ్‌మెంట్ వ్యవహారం’ బట్టబయలు కావడంతో తెలుగు తమ్ముళ్లకు గట్టి షాక్ తగిలినట్లైంది.