మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, నిద్రలోకి జారుకున్న లింగారెడ్డి
సాక్షి, కడప రూరల్/ అగ్రికల్చర్: కడప మున్సిపల్ గ్రౌండ్‌లో మంగళవారం చంద్రబాబు పాల్గొన్న టీడీపీ ఎన్నికల సన్నాహక సమావేశం ఆ పార్టీ శ్రేణులను నిరుత్సాహ పర్చింది. జిల్లాకు వచ్చినప్పుడల్లా చెప్పే మాటలనే సీఎం పునరావృతం చేశారు. కొన్ని సందర్భాల్లో ఆయన పొంతన లేని ధోరణితో మాట్లాడారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీల ఊచకోతకు కారకుడయ్యాడని, అప్పుడు తానే ముందుండి నరేంద్రమోదీ అన్యాయంపై నిలదీశానని టీడీపీ అధినేత చొప్పుకొచ్చారు. మోదీ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక తాముబీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు.
ఈ రెండు అంశాలకూ సంబంధం లేకపోవడం కొందరిని గందరగోళపర్చింది. మోదీ రాష్ట్రానికి అన్యాయం చేయడంతోనే ప్రభుత్వంలోంచి బయటకు వచ్చామన్నారు. బీజేపీతో ఉన్న నాలున్నరేళ్ల కాలంలో ఏం చేసిందీ చెప్పుకోలేక పోయారు. కడప ఉక్కుఫ్యాక్టరీ గురించి గడచిన ఐదేళ్లుగా చెబుతున్నదే మరోమారు వినిపించారు. మళ్లీ ప్రభుత్వం రాగానే ఉక్కుఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి యువతకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. హార్టికల్చర్ హబ్ గురించీ అదే మాట. జిల్లాకు వచ్చినప్పుడల్లా పండ్లతోటలకు కొదవలేదని, పండ్లను ఎగుమతులకు అవకాశం కల్పిస్తామని, ఉప ఉత్పత్తుల పరిశ్రమలు రప్పిస్తామని చెబుతూనే ఉన్నారని సభకు వచ్చిన కొంతమంది చర్చించుకోవడం కనిపించింది. ఇలా ప్రతి అంశాన్ని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నించారు. ప్రతిపక్షనేత జగన్‌ను విమర్శించడానికి ఎక్కువ సమయం కేటాయించారు. పదే పదే పసలేని విమర్శలతో విసుగు తెప్పించారు. మీరంతా నాకే ఓటు వేయాలంటూ హుకుం జారీ చేశారు.
వరద, వీరశివా డుమ్మా..
ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన పార్టీ ఇన్‌చార్జ్ వరదరాజులరెడ్డి ఈ సభకు హాజరు కాలేదు. కమలాపురం టికెట్ రాని వీరశివారెడ్డి కూడా సభకు డుమ్మా కొట్టారు. ఎన్నికల సన్నాహక సభ పార్టీకి చెందిన సేవా మిత్రలు, బూత్ కన్వీనర్లకు సంబంధించినది. కానీ సభా ప్రాంగణంలో ఎక్కువ సంఖ్యలో డ్వాక్రా మహిళలు కనింపించడం అందరిని విస్మయానికి గురిచేసింది. సీఎం చంద్రబాబునా యుడు తన ప్రసంగంతో ఉత్సాహ పరచడానికి విఫలయత్నం చేశారు. ఆయన ప్రసంగం ప్రారంభించే సమయానికి చాలా మంది వెళ్లిపోయారు. సమావేశంలో పార్టీ అభ్యర్థులు ఆదినారాయణరెడ్డి, సతీష్‌కుమార్‌రెడ్డి, లింగారెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్, పుత్తా నరసింహారెడ్డి రమేష్ కుమార్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, నరసింహప్రసాద్, రాజశేఖర్, అమీర్‌బాబు, చంగల్‌రాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment