
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు రాజ్యాంగబద్ధంగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. రెండు ప్రధాన పార్టీలు మెజారిటీ ఉండి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కోరినా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరంగా, ప్రజాస్వామ్యయుతంగా చేయకుండా రాజకీయ లబ్ధి కోసం పాకులాడటం ఎంత వరకు న్యాయమని చంద్రబాబు ప్రశ్నించారు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో పర్యటించారు.
వలేటివారిపాలెం మండలం పోకూరులో నీరు–ప్రగతి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత అదే మండలంలోని నూకవరం, బడేవారిపాలెం తదితర గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రచ్చబండ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పట్టిసీమ ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలను ప్రకాశం జిల్లా మీదుగా సోమశిలకు తరలిస్తామన్నారు. కాగా ముఖ్యమంత్రి ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభదిన శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment