
సాక్షి, రాజమండ్రి : కేంద్రంతో చంద్రబాబు నాయుడు ఇప్పట్లో తెగదెంపులు చేసుకోరని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. టీడీపీ బెదిరింపులతో ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..పార్లమెంట్ వెల్‌లోకి వెళ్లి టీడీపీ ఎంపీలు పోరాటం చేస్తే ఏం ప్రయోజనం లేదన్నారు. ఆంధ్రాకు ఏమిచ్చినా కాంట్రాక్టర్ల కోసమే కానీ, ప్రజల కోసం కాదన్న అభిప్రాయంలో కేంద్రంలో ఉందని ఉండవల్లి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు కేంద్రంతో పోరాటానికి ఇంకా అవకాశం ఉందని, నేరుగా పోరాటం చేయాలని సూచించారు.
మరోవైపు కేంద్ర బడ్జెట్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ పెదవి విరిచారు. రైతులకు గిట్టుబాటు ధర శుద్ధ అబద్ధమని ఆయన అన్నారు. వైద్యానికి ఐదు లక్షల బీమా పథకంలో అర్థం పర్థం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు గత నాలుగేళ్లుగా బడ్జెట్‌లో ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరిగిందన్నారు. విభజన చట్టంలో భాగంగా విశాఖలో పెడతామన్న రిఫైనరీని ఇప్పుడు ముంబాయిలో పెడుతుంటే ఏమనాలని ఆయన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment