సాక్షి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల్లో మద్యాన్ని ఏరులై పారించి యువతను, ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇప్పటి నుంచే అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే మద్యం ఇండెంట్లుకు తగ్గించే అవకాశాలు ఉండడంతో ముందుగానే మద్యం కొనుగోళ్లు చేసుకొనేందుకు ప్రయత్నాలు మమ్మురం చేశారు. ఇప్పటికే జిల్లా అధికార పార్టీలో కీలక నేత మద్యం సిండికేట్‌తో చర్చలు జరిపి ఎమ్మార్పీ ఉల్లంఘనకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు.
అందుకు ఆయన భారీగానే తాయిలాలు పుచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అభ్యర్థులకు మద్యం పంపిణీలో ఇబ్బంది లేకుండా ముందుగానే సిద్ధంగా ఉంచాలనే ఆదేశాలు ఇచ్చారు. దీంతో భారీగా ఇండెంట్లు పెట్టి కేసులు తెప్పించినట్లు సమాచారం. గత మూడు నెలల్లో భారీగా మద్యం కొనుగోళ్లు గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
నోటిఫికేషన్ వస్తే..
ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మద్యం విక్రయాల్లో నిబంధనలు అమలవుతాయి. గతేడాది ఇదే నెలల్లో ఎంత విక్రయాలు జరిగాయో.. అంతే ఇండెంట్లో వ్యాపారులకు మద్యం సరఫరా అవుతుంది. సాధారణంగా అయితే ఈ లిమిట్ ఉండదు. దీని కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే మద్యం వ్యాపారులతో కలిసి అధికార పార్టీ నేతలు భారీగా కొనుగోళ్లు పెంచినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టీడీపీ నేతలు ముందుగానే తమ షాడో నేతలను రంగంలోకి దింపారు. వైన్ షాపుల నుంచి మద్యం కేసులు కొనుగోళ్లు చేయించి రహస్య ప్రాంతాల్లో దాచి ఉంచాలని నేతలు ఆదేశించడంతో వారు మద్యం కేసులు సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే దాదాపు వేల కేసుల మద్యం రహస్య ప్రాంతాలకు తరలించేసుకుంటున్నారు.
రెండింతలు పెరిగిన కొనుగోళ్లు
జిల్లాలో గతేడాది ఫిబ్రవరిలో జరిగిన వ్యాపారంతో పోల్చుకుంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండింతలు కొనుగోళ్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది. జిల్లాలో 350 మద్యం దుకాణాలు ఉండగా ఎక్కువ దుకాణాలు అధికార పార్టీకి చెందిన నేతలవే ఉన్నాయి. మద్యం సిండికేట్‌తో సమావేశమైన టీడీపీ కీలకనేత తమ పార్టీ అభ్యర్థులకు ఎన్నికలకు సరిపడా మద్యం సరఫరా చేయాలని ముందుగానే ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా మద్యం డిపో నుంచి కొనుగోళ్లు చేసి టీడీపీ నేతలకు విక్రయాలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన మద్యం విక్రయాలే చెప్పవచ్చు. గత నెలలో రూ.138 కోట్లు విలువ చేసే 2,46,597 లిక్కర్, 1,45,807 బీరు కేసులు విక్రయాలు జరిగాయి. అదే గతేడాది ఫిబ్రవరి నెలలో రూ.88 కోట్లు విలువ చేసే 1,79,849 లిక్కర్, 92,057 బీరు కేసులు విక్రయాలు జరిగాయి. అంటే ఈ ఏడాది దాదాపు రూ.50 కోట్లు ఎక్కువగా మద్యం క్రయవిక్రయాలు పెరిగినట్లుగా గణాంకాలు చూపిస్తున్నాయి.
జిల్లాలో మద్యం కొనుగోళ్లు
సంవత్సరం | లిక్కర్ కేసులు | బీరు కేసులు | వ్యాపారం (రూ.కోట్లు) |
2018 ఫిబ్రవరి | 1,79,849 | 92,057 | రూ.88 |
2019 ఫిబ్రవరి | 2,46,597 | 1,45,807 | రూ.138 |
ఎమ్మార్పీ ఉల్లంఘనకు గ్రీన్‌సిగ్నల్
జిల్లాలోని ఎన్నికల ముందుగానే మద్యం «ధరలు పెంచుకునేందుకు జిల్లా అధికార పార్టీలోని కీలక నేత గ్రీన్‌సిగ్నల్ ఇప్పించారు. మద్యం సిండికేట్‌తో సమావేశ మైన కీలక నేత ప్రతి మద్యం బాటిల్‌పై అదనంగా రూ.5 వంతున అదనంగా పెంచి విక్రయాలు చేసుకొనేలా ఆదేశాలిప్పించారు. ఎక్సైజ్ శాఖ కనుసన్నల్లోనే మద్యం ధరలు పెంచేశారు.
గత ఇరవై రోజులుగా ప్రతి క్వాటర్ బాటిల్ , బీరు బాటిల్‌పై ఎమ్మార్పీ కంటే అదనంగా పెంచి విక్రయాలు చేస్తున్నారు. ఇలా చేసుకొనేందుకు కీలక నేతకు దాదాపు రూ.30 లక్షల వరకు తాయిలాలు సిండికేట్ ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ ఉన్నతాధికారుల నుంచి స్థానిక స్టేషన్ల వరకు అందరికీ గతంలో మాదిగానే నెలవారీ మామూళ్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. పోలీసులకు కూడా నెలవారీ మామూళ్లు అందేలా ఒప్పందం చేసుకొని ఎమ్మార్పీ ఉల్లంఘన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment