
లక్నో: కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్ పాల్పడిందని బీఎస్పీ చీఫ్ మాయావతి ఆరోపించారు. ఎన్నికల ఫలితాలపై శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ట్యాంపరింగ్‌కు పాల్పడకుంటే తమ పార్టీ అభ్యర్థులే గెలిచేవారన్నారు. 2014 లోక్‌సభ, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అయినా మొత్తంగా చూస్తే మేం ఓటమి చెందినట్లు కాదని, రెండో స్థానంలో నిలిచామన్నారు.
ఈ విజయం కేవలం దళితుల మద్దతుతోనే పొందలేదని ఇతర వెనుకబడిన వర్గాలు, ముస్లింలు సైతం తమ పార్టీకి మద్దతు తెలిపాయని ఆమె పేర్కొన్నారు. ‘ప్రతి ఒక్కరి ఆశయం.. ప్రతి ఒక్కరి సంతోషం’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించామన్నారు. అందరి సంక్షేమం కోసం బీఎస్పీ పాటుపడుతోందని ఆమె స్పష్టం చేశారు.
బీజేపీ నీతి, నిజాయితీకి కట్టుబడి ఉంటే.. దేశప్రజలు మీ వైపు ఉన్నారని భావిస్తే ఈవీఎంలను నిషేదించి బ్యాలెట్‌పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని ఆమె సవాల్ విసిరారు. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ గెలువదన్నారు. ఇక 16 మునిసిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో 14 చోట్ల బీజేపీ రెండు చోట్ల బీఎస్పీ (అలీగఢ్, మీరట్ నగరాల) మేయర్ పదవులను కైవసం చేసుకుంది.