
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఊహించినట్టే జరిగింది. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డికి ఈ సారి టికెట్ చేజారింది. ఆయన స్థానంలో జడ్చర్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని నవాబ్‌పేటకు చెందిన మన్నె శ్రీనివాస్‌రెడ్డికి సీఎం కేసీఆర్ గురువారం రాత్రి బీ ఫాం అందజేశారు. దీంతో నిన్నటి వరకు టికెట్ తనకే వస్తుందనే ధీమాతో ఉన్న జితేందర్‌రెడ్డి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ క్రమంలో టికెట్ కేటాయింపు విషయంలో పార్టీ అధినేతదే తుది నిర్ణయమని పలు సందర్భాల్లో చెప్పిన జితేందర్‌రెడ్డి ఇంకా గులాబీ దళంలోనే కొనసాగుతారా? లేక పార్టీ మారుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే జితేందర్‌రెడ్డికి ఈ సారి టికెట్ రాదని విస్తృత ప్రచారం జరిగింది. ఈ నెల 11న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కొందరు సిట్టింగ్ ఎంపీలకు పార్టీ నుంచి మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వలేమని స్పష్టం చేశారు. టికెట్ రాని వారి జాబితాలో జితేందర్‌రెడ్డి పేరు కూడా ఉందా? మళ్లీ టికెట్ రాదనే ప్రచారం అప్పుడే మొదలైంది. ఇదే క్రమంలో జితేందర్‌రెడ్డి కాంగ్రెస్ లేదా బీజేపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఉమ్మడి జిల్లాలో జరిగింది. కానీ జితేందర్‌రెడ్డి మాత్రం పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘ కేసీఆర్ తనను సొంత తమ్ముడిలా చూసుకున్నారు. ఇప్పటికీ ఆయనపై పూర్తి నమ్మకం ఉంది’ అనే సందేశం వాట్సప్ గ్రూపుల్లో హల్‌చల్ చేస్తోంది.
వ్యతిరేకతే కారణం..
పార్టీలో ఉన్న వ్యతిరేకతే జితేందర్‌రెడ్డికి టికెట్ రాకపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వకుండా ఆయన అనుచరులకు మద్దతు తెలిపారంటూ పలువురు ఎమ్మెల్యేలు బాహాటంగానే జితేందర్‌రెడ్డిని విమర్శించారు. ఎన్నికల ఫలితాల అనంతరం మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇదే క్రమంలో ఎంపీ టికెట్ ఖరారు చేసే క్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారందరూ జితేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని నిరాకరించినట్లు తెలిసింది. దీంతో కేసీఆర్ ఈ స్థానం నుంచి కొత్తవారికి అవకాశం కల్పించాలని కేసీఆర్ అప్పుడే నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో నవాబ్‌పేటకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎంఎస్‌ఎన్ ఫార్మా కంపెనీ అధినేత సత్యనారాయణ రెడ్డి తమ్ముడు శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఖరారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment