మంగళవారం శాసనసభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఎస్సీల మధ్య చిచ్చుపెట్టి విభజించడం ద్వారా లబ్ధిపొందాలని చంద్రబాబునాయుడు దిక్కుమాలిన నీచ రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎస్సీ కమిషన్ బిల్లుపై మంగళవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు పోడియంలోకి వెళ్లి నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా వైఎస్ జగన్ జోక్యం చేసుకుని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటుచేయాలని తమ సర్కారు చరిత్రాత్మక బిల్లులు తెస్తే ఎస్సీ కమిషన్ బిల్లును శాసన మండలి తిప్పి పంపిందని.. మళ్లీ అసెంబ్లీలో దీనిని యథాతథంగా పెడితే ఇక్కడ బలం లేనందున టీడీపీ ఎమ్మెల్యేలు పోడియంలోకి వెళ్లి రచ్చచేస్తున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు ‘జైజై అమరావతి’ అనే నినాదాలతో ఎందుకు పోడియంలోకి వెళ్లారో? ఎందుకు జైజై అమరావతి అంటున్నారో వారికే అర్థం కావడంలేదన్నారు. ఇదీ విపక్ష నేత చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యేల దిక్కుమాలిన వైఖరి అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి తమ ధ్యేయమని.. ఇందుకు తమ చర్యలే నిదర్శనాలని.. ఎస్సీలను కలిపి ఉంచడం ద్వారానే అభివృద్ధి చేయాలని తాము ప్రయత్నిస్తుంటే చంద్రబాబు మాత్రం జనాభాలో దాదాపు 18 శాతం ఉన్న వారిని విడదీయడం కోసం స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సీఎం ఇంకా ఏమన్నారో సంక్షిప్తంగా ఆయన మాటల్లోనే..
మూడు ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటుచేశాం
రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా మాలలకు ఒకటి, మాదిగలకు మరొకటి, రెల్లి ఇతర కులాలకు వేరొకటి కలిపి ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటుచేశాం. అందరినీ ప్రగతిపథంలో నడపాలన్నది మా విధానం. దాదాపు 18 శాతం ఉన్న ఎస్సీలు కలిసి ఉంటే, వారి డిమాండ్లకు తలొగ్గాల్సి వస్తుంది. అందువల్ల విడగొట్టాలన్న దుర్బుద్ధితో చంద్రబాబు వ్యవహరించారు. మేం మాత్రం ఎస్సీలంతా సమిష్టిగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మూడు కార్పొరేషన్లు ఏర్పాటుచేశాం.
మరింత మేలు చేసేందుకు కమిషన్లు
ఎస్సీ, ఎస్టీలను ఆర్థికంగా, సామాజికంగా మరింత ప్రగతిపథంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వారికి వేర్వేరు కమిషన్లు ఏర్పాటుచేయాలని బిల్లు పెట్టాం. మా పట్ల ఎస్సీ, ఎస్టీలు ఎంతో అభిమానం చూపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో రెండు మినహా మొత్తం వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ వర్గాలకు చెందిన స్థానాల్లో టీడీపీ నుంచి ఒకరు, జనసేన నుంచి మరొకరు మాత్రమే గెలిచారు. జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూడా ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసి సమయానుగుణంగా మద్దతు ఇస్తున్నారు. టీడీపీ.. వారికి ఉన్న ఏకైక ఎస్సీ సభ్యుణ్ణి ముందు పెట్టి నీచ రాజకీయాలు చేస్తోంది. ఆయన వైఖరిని చూసి ఎందుకు గెలిపించామా? అని ఆ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు.
కీలక శాఖలు కేటాయించాం
గతంలో ఎప్పుడూ లేని విధంగా మా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఆరు మంత్రి పదవులు ఇచ్చింది. వారిలో ఇద్దరు (ఒక ఎస్సీ, ఒక ఎస్టీ) ఉప ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. అంకెల్లోనే కాదు. కీలక శాఖలు కూడా ఈ వర్గాల వారికి ఇచ్చాం. కీలకమైన విద్య, హోంశాఖలకు ఎస్సీ మంత్రులే ఉన్నారని గర్వంగా చెప్పగలం. రెవెన్యూ ఆర్జనలో కీలకమైన ఎక్సైజ్ శాఖను ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీలకు ఇంకా మేలు చేయడం కోసం మరోసారి అసెంబ్లీలో చరిత్రాత్మక బిల్లును యథాతథంగా ప్రవేశపెట్టాం. దీనికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం’.. అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment