
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకే సీపీఎం కృషి చేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సాధారణ ఎన్నికల తర్వాతే పొత్తుల అంశాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఇండియన్ ఉమెన్ ప్రెస్ కార్ప్‌లో గురువారం ఏర్పాటు చేసిన రాజకీయ చర్చలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రధాని మోదీ ప్రజలకు సమాధానం చెప్పే స్థితిలో లేరని, అందుకే రామ మందిర రాజకీయాలను తెరపైకి తెచ్చారని విమర్శించారు.
రామ మందిరం, శబరిమల అంశాలను వివాదాస్పదం చేయడం ద్వారా హిందుత్వ ఓటింగ్‌ను సంఘటితం చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రామ మందిర రాజకీయాలు దక్షిణ భారతంలో చెల్లవన్నారు. హిందుత్వ విషయంలో కాంగ్రెస్ కూడా రాజీ పడి సెక్యులరిజానికి తూట్లు పొడుస్తోందని, అందువల్లే దేశంలో సెక్యులరిజంపై నమ్మకం సడలుతోందని పేర్కొన్నారు.