సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ఈనెల 2న వెలువడనుంది. వాస్తవానికి గురువారమే తొలి జాబితా విడుదల చేయాల్సి ఉన్నా.. అష్టమి కావడంతో శుక్రవారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. గురువారం జరగనున్న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేసిన అనంతరం రాహుల్ ఆమోదముద్ర వేస్తారని, శుక్రవారం తొలి జాబితా వస్తుందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. తొలి జాబితాలో కాంగ్రెస్ పోటీ చేయనున్న స్థానాల్లో 2/3వ వంతు.. అంటే దాదాపు 60 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం. మిగిలిన జాబితాను మరో దఫా విడుదల చేస్తారని, అది ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే.. లేదంటే ఆ తర్వాత వస్తుందని తెలుస్తోంది.
ఆశావహుల్లో ఉత్కంఠ
ఇన్నాళ్లు ఎలాగొలా నెట్టుకొచ్చినా టికెట్ల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. పార్టీ పోటీ చేస్తుందని భావించిన వాటిలో 50కిపైగా స్థానాల్లో పెద్దగా సమస్యలు లేకున్నా మిగిలిన చోట్ల తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో స్థానానికి ఇద్దరు, ముగ్గురు నుంచి 30 మంది దాకా కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఎవరికి వారే తమకే టికెట్ వస్తుందనే అంచనాతో తీవ్ర ప్రయత్నాలు చేసుకున్నారు. అటు ఏఐసీసీ పెద్దలు, ఇటు టీపీసీసీ ముఖ్యులను ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడ్డారు. ఇప్పుడు వారంతా టికెట్లు ఎప్పుడు ప్రకటిస్తారా.. జాబితాలో తమ పేరు వస్తుందా లేదా అనే ఉత్కంఠలో గడుపుతున్నారు.
కాంగ్రెస్ జాబితాకు అడ్డొచ్చిన అష్టమి!
Published Thu, Nov 1 2018 5:11 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment