మాట్లాడుతున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
సాక్షి, సారంగాపూర్(జగిత్యాల): నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఎన్నిక జరగకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని, అందుకే రైతులతో నామినేషన్లు వేయించిందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఆరోపించారు. ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వారిలో అత్యధికులు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుయాయులే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. సోమవారం సారంగాపూర్ మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కవిత విజయాన్ని అడ్డుకునేందుకు పసుపు రైతుల ముసుగులో చాలామంది నామినేషన్లు వేశారని, అందులో సగానికిపైగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే ఉన్నారని ఆరోపించారు. నిజామాబాద్ పార్లమెంట్ బరిలో 185 మంది ఉన్నారని, టీఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తు కనిపించకుండా చేయాలన్న దురుద్దేశంతోనే వారు ఉపసంహరించుకోలేదని పేర్కొన్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైతులు మాత్రమే నామినేషన్లు వేస్తే అనుమానం వచ్చేది కాదని, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ పరిధికి చెందినవారూ నామినేషన్లు వేయడం ఏమిటని, వారు కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల నుంచి వేయొచ్చు కదా..? అని ప్రశ్నించారు. ఎన్నిక వాయిదా వేయాలనే కాంగ్రెస్ కుట్రలో భాగమే ఇదంతా అన్నారు. కవితకు రైతులు, రైతు కూలీల సంపూర్ణ మద్దతు ఉందని దీమా వ్యక్తం చేశారు. పసుపుబోర్డు ఏర్పాటుకు కవిత అనేకసార్లు కేంద్రమంత్రులకు విజ్ఞాపన పత్రాలు అందించారని తెలిపారు. కేంద్రం స్పందించకుంటే ఆ నెపం కవితపై నెట్టడమేంటని ప్రశ్నించారు. సమావేశంలో ఎంపీపీ కొల్ముల శారద, విండో చైర్మన్ ముప్పాల రాంచందర్‌రావు, మాజీ జెడ్పీటీసీ కొల్ముల రమణ, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కోల శ్రీనివాస్, సర్పంచ్‌లు గుర్రాల రాజేందర్‌రెడ్డి, కొత్తూరి రాజేశ్వరి, మాజీ ఎంపీటీసీ చిట్నేని రవీందర్‌రావులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment