
డియోహర్(జార్ఖండ్): జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా శనివారం జార్ఖండ్‌లోని గొడ్డాలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం దేవగఢ్‌లో ప్రఖ్యాత బైద్యనాథ్ ఆలయంలో రుద్రాభిషేకం చేశారు. స్థానిక ర్యాలీలో మాట్లాడారు.
‘‘యువత ఉద్యోగాలు కోరుతుంటే ప్రధాని మోదీ మాత్రం దేశంలో నిరుద్యోగమనే వ్యాధిని వ్యాప్తి చేస్తున్నారు. ఈ వ్యాధి సోకిన యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది’’ అని రాహుల్ అన్నారు. దేశంలో గిరిజన, దళిత, వెనుకబడిన వర్గాల ప్రజల సంఖ్యను కచ్చితంగా తేల్చేందుకు కులగణన అవసరం ఎంతో ఉందని ఆయన చెప్పారు. దేశంలో అన్యాయాలకు గురవుతున్న వారిలో ఈ వర్గాల ప్రజల సంఖ్య పెరుగుతూ పోతోందని తెలిపారు.