
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యాణ్మాయం...
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ అయ్యింది. కాంగ్రెస్ పెద్దలు.. రాజగోపాల్ రెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే రాజకీయ ఫిరాయింపు చట్టం వర్తించదన్న వాదనలపై న్యాయ నిపుణుల సలహా తీసుకొని తుది నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే. తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వంలో లోపం ఉంది. నేతలందరూ బీజేపీ వైపే చూస్తున్నారు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరతారనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు ఊహాగానాలేనని ఆయన కొట్టిపారేశారు. పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గ నేతలు, కార్యకర్తలను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.