
సాక్షి, కరీంనగర్ : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. అవిశ్వాస తీర్మానంలో తెరాస శిఖండి పాత్ర పోషించిందని విమర్శించారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ప్రతిపాదనను అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సమక్షంలో టీఆర్‌ఎస్ అంగీకరించదని గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు మద్దతు ఇవ్వమని తాము అడగడం లేదని, అక్కడి ఎంపీలు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వమని కోరుతున్నామన్నారు. ఏపీ పై తమ ప్రతి స్పందన కోరే ముందు తెలంగాణ ఇచ్చేముందు హోదా ఇవ్వడానికి టీఆర్‌ఎస్ అంగీకారం తెలిపిందో లేదో వినోద్ కుమార్ చెప్పాలన్నారు. విభజన హామీలపై పోరాడకుండా కాంగ్రెస్‌ను నిందించడం తగదన్నారు. పోలవరం కోసం ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసినప్పుడు కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తెలంగాణ పౌరుషాన్ని తాకట్టు పెట్టి కేంద్రంతో సఖ్యతగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ వేదికను ఉపయోగించుకోకుండా కాంగ్రెస్‌ను విమర్శించడం తగదని హెచ్చరించారు.
మంత్రి పదవి ఇస్తే పోరాడేవాడా
దివంగత నేత రాజశేఖర్ రెడ్డి హయంలో తాము తెలంగాణ కోసం పోరాటం చేశామని, టీఆర్‌ఎస్ నేతలు చరిత్ర మరచి మాట్లాడటం విడ్డూరంగా ఉందనన్నారు. చంద్రబాబు నాయుడు మత్రి పదవి ఇస్తే కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడేవాడా అని పోన్నం ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో హరీశ్ రావు యువతను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు పురిగొల్పారని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను టీఆర్‌ఎస్ విమర్శించడం తగదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment