వి. హనుమంత రావు
ఢిల్లీ: పక్క రాష్ట్రం ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి మీద కేసీఆర్ మాట్లాడిన భాష సరైనవిధంగా లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో వీహెచ్ విలేకరులతో మాట్లాడుతూ..కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిలాగా ప్రవర్తించడం లేదని విమర్శించారు. గ్రామాల్లో చదువులేని వారు మాట్లాడే భాషలాగా, ఒక ఊరు భాషలాగా కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుని సంక నాకుతున్నావా అని అనడం సమంజసం కాదన్నారు. నీ అవసరం బట్టి ఇతర నాయకుల సంక నాకుతున్నావ్ కదా అని కేసీఆర్‌పై పరుష పదజాలం వాడారు. ఇలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ని తాను ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు.
బీసీ రిజర్వేషన్లు ఏమయ్యాయ్
బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ ఎందుకు పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నారని సూటిగా అడిగారు. మోదీని కలిసి ఇచ్చిన 16 అంశాలలో బీసీల అంశం ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ స్పూర్తిని దెబ్బకొట్టడానికి కేసీఆర్ చూస్తున్నారని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ప్రజలు కేసీఆర్‌కి బుద్ది చెబుతారని జోస్యం చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులైనా ఇప్పటి వరకు క్యాబినేట్ ఎందుకు ఏర్పాటు చేయలేదని అడిగారు. కేసీఆర్ ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment