ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. అనూహ్య పరిణామాలు, ఫిరాయింపులతో రాజకీయం రక్తికడుతోంది. మోదీ నెల రోజుల్లోపే మూడుసార్లు గుజరాత్‌లో పర్యటించగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా క్షేత్రస్థాయిలో చురుకుగా కదులుతున్నారు. నవంబర్–డిసెంబర్ నెలల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. హిమాచల్‌ప్రదేశ్ ఓట్ల లెక్కింపు డిసెంబర్ 18న ఉంది కాబట్టి.. గుజరాత్ లెక్కింపు కూడా అదే రోజు ఉండే అవకాశాలుంటాయి. అంటే డిసెంబర్ 15లోగా గుజరాత్‌లో ఎన్నికలు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌లో అసలు ఏం జరుగుతోంది? ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలేమిటనే
అంశాలపై దృష్టి సారిద్దాం..
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
గడిచిన 22 ఏళ్లుగా గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ఇంత సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీపై సాధారణంగానే జనంలో వ్యతిరేకత ఉంటుంది. దీనికి తోడు మోదీ నేతృత్వం లేకుండా జరుగుతున్న ఎన్నికలివి. గుజరాత్ సీఎంగా మోదీ గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి హ్యాట్రిక్ విజయాలను అందించారు. ఆయన ప్రధానిగా ఢిల్లీకి వెళ్లడంతో రాష్ట్రస్థాయిలో బీజేపీకి నాయకత్వ శూన్యత ఏర్పడింది. పటిష్ట నాయకత్వం కొరవడింది. వీటిని దృష్టిలో పెట్టుకునే కమళ దళపతి అమిత్‌షా చాన్నాళ్ల ముందు నుంచే గుజరాత్‌పై దృష్టి కేంద్రీకరించారు. క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రచించి.. అమలుకు పార్టీ శ్రేణులను పురమాయిస్తున్నారు. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో వచ్చే ఎన్నికల్లో 150 పైచిలుకు స్థానాల్లో గెలవాలని అమిత్‌షా లక్ష్యంగా నిర్దేశించారు.
కాంగ్రెస్ కురువృద్ధుడు శంకర్‌సింహ్ వాఘేలాతో తిరుగుబాటు చేయించి.. కాంగ్రెస్ వ్యూహకర్త అహ్మద్‌పటేల్ రాజ్యసభకు ఎన్నిక కాకుండా చూడాలని అమిత్‌షా సర్వశక్తులూ ఒడ్డారు. కర్ణాటకలో గుజరాత్ ఎమ్మెల్యేల శిబిరాన్ని నిర్వహించిన మంత్రిపై ఆదాయపన్ను శాఖ దాడులూ జరిగాయి. ఇతర పార్టీలకు భిన్నమని చెప్పుకునే బీజేపీ ఏది నైతికం, ఏది అనైతికమనేది చూడకుండా అన్ని ప్రయత్నాలూ చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కుంభస్థలాన్ని కొట్టి.. ఆ పార్టీ శ్రేణులను డీలాపడేలా చేయాలని చూశారు కమలనాథులు. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు చేసిన పొరపాటుతో వారి ఓట్లు చెల్లకుండాపోయి.. అహ్మద్‌పటేల్ అతికష్టం మీద గెలిచారు.
పటీదార్లకు రిజర్వేషన్లు ఇస్తే తాము నష్టపోతామని ఓబీసీలు ఉద్యమించారు. ఓబీసీ ఏక్తా మోర్చా కన్వీనర్ అల్పేశ్ ఠాకోర్‌ను కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకుంది. అలాగే ఉనాలో దళితులపై దాడుల నేపథ్యంలో ఆ వర్గం యువనేతగా జిఘ్నేష్ మేవానీ ఎదిగారు. సోమవారం రాహుల్‌ను కలవాల్సిందిగా జిఘ్నేష్‌ను కూడా కాంగ్రెస్ ఆహ్వానించింది. కాంగ్రెస్ పార్టీలో చేరబోవడం లేదని స్పష్టం చేసిన జిఘ్నేష్.. బీజేపీని ఓడించాలనే కృతనిశ్చయంతో ఉన్నానని చెప్పారు. దీన్నిబట్టి దళిత యువత
మద్దతు కాంగ్రెస్‌కు ఉంటుందనేది స్పష్టమవుతోంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కోసం పటీదార్లు, ఓబీసీలు ఉద్యమించినా.. బీజేపీకి వ్యతిరేకంగా కలసి పనిచేసే వారికి ఇప్పుడు కాంగ్రెస్ ఒక వేదికగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. గతంలో కాంగ్రెస్ ఖామ్(క్షత్రియులు, హరిజనులు, ఆదివాసీలు, ముస్లిం)ల సమీకరణంతో గుజరాత్‌లో గెలిచేది. ఇప్పుడు వివిధ సామాజిక వర్గాల్లో బీజేపీపై గూడుగట్టుకున్న అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కొత్త సమీకరణాలకు తెరతీస్తోంది. పటీదార్లు–ఓబీసీలు–దళితులను ఏకం చేసి.. బీజేపీ హిందూత్వకు చెక్ పెట్టాలని వ్యూహరచన చేస్తోంది. గతంలోలాగా ముస్లింల గురించి పెద్దగా మాట్లాడటం లేదు. ఎందుకంటే గుజరాత్‌లో పోటీ రెండు పార్టీల మధ్యే. ముస్లింలు బీజేపీకి ఓటేయరు కాబట్టి వారి మద్దతు ఎలాగైనా తమకే ఉంటుందనేది కాంగ్రెస్ ధీమా.
మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిచిన్న గ్రూపును కలుపుకుని పోవడం ద్వారా ఓట్ల చీలికను నివారించాలని చూస్తోంది. జేడీ(యూ)కు చెందిన చోటూభాయ్ వసావా ఆరుసార్లు ఎమ్మెల్యే. గిరిజనుల్లో పట్టున్న నేత. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కలసి పనిచేస్తానని ఆయన ప్రకటించారు. ఎన్సీపీతో పాటు ఆప్‌లోని కొందరు ముఖ్యనేతలను కూడా కాంగ్రెస్ దువ్వుతోంది. పార్టీలో చేరకున్నా.. ఇండిపెండెంట్‌గా పోటీచేస్తే మద్దతిస్తామని కొంచెం పలుకుబడి ఉన్న నాయకులకు ఆఫర్లు ఇస్తోంది. తద్వారా బిహార్‌లో మహాకూటమి ఏర్పాటు ద్వారా సాధించిన ఫలితాన్ని గుజరాత్‌లోనూ పునరావృతం చేయాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఆ దిశగా ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. మోదీ స్వరాష్ట్రంలో ఆయన్ని ఓడిస్తే.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సానుకూల పవనాలుంటాయనేది ఆ పార్టీ ఆశ.
యువతే టార్గెట్..
హార్దిక్ పటేల్, అల్పేశ్ ఠాకోర్, జిఘ్నేశ్ మేవానీ ఆయా సామాజికవర్గ ప్రతినిధులే అయినా.. వీరికి యువతలో విపరీతమైన ఆదరణ ఉంది. కారణమేమిటంటే.. వీరు నవతరం ప్రతినిధులు. హార్దిక్‌కు 24 ఏళ్లు. జిఘ్నేష్‌కు 34 ఏళ్లు. అల్పేశ్ వయసు 39 ఏళ్లు. గుజరాత్ జనాభాలో ఏకంగా 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారే. ఈ యువనేతల జనాకర్షణ శక్తిని ఓట్లుగా మలచుకుని లాభపడాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. నిరుద్యోగ భృతి ఇస్తామని, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని హామీలు ఇస్తూ యువతను తమవైపు తిప్పుకునే యత్నం చేస్తోంది.
హిందూత్వ, అభివృద్ధి మంత్రం..
రెండు దశాబ్దాల పైచిలుకు అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రజావ్యతిరేకతను అధిగమించడం అంత సులువేమీ కాదు. సమాజంలోని వివిధ వర్గాల్లో బీజేపీపై తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ మళ్లీ హిందూత్వ కార్డును తెరపైకి తెస్తోంది. తాజ్‌మహల్‌పై యూపీ బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్య లు, అయోధ్యలో రామమందిర నిర్మాణంపై నాయకుల ప్రకటనలను ఈ కోణంలోనే చూడొచ్చని రాజకీయ వ్యాఖ్యాతలు విశ్లేషిస్తున్నారు.
గుజరాత్‌లో అత్యంత ప్రాబల్యవర్గం వ్యాపారులు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ మూలంగా వీరు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాబట్టే ప్రధాని మోదీ.. దీన్ని అన్ని పార్టీల సమష్టి నిర్ణయమని చెప్పే యత్నం చేశారు. అన్ని పార్టీలతో చర్చించామని, కాంగ్రెస్ కూడా జీఎస్‌టీని ఆమోదించిందని ఇటీవల గుజరాత్ పర్యటనలో నొక్కి చెప్పారు. అభివృద్ధి మంత్రం పఠించారు. గుజరాతీ ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నారు. కాంగ్రెస్‌కు గుజరాతీలంటే ఇష్టం లేదంటూ.. ప్రధానిగా ఉంటూ ఒక రాష్ట్ర నేత స్థాయిలో మాట్లాడారు.. వీటిని బట్టి..మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గుజ రాత్ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
వ్యతిరేకులను ఏకం చేసే యత్నం..
వివిధ వర్గాల్లో బీజేపీపై నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. సామాజికంగా కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. అత్యంత ప్రాబల్యం కలిగిన పటీదార్ల(పటేల్ సామాజికవర్గం)ను అక్కున చేర్చుకునేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. రెండేళ్ల కిందట విద్య, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కావాలంటూ పటీదార్లు తీవ్రంగా ఉద్యమించారు. దీనికి నేతృత్వం వహించిన ఫైర్‌బ్రాండ్ యువనేత హర్దిక్ పటేల్ పేరు మారుమోగింది. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పాస్) నాయకుడిగా ఆ సామాజిక వర్గానికి ప్రతినిధిగా హార్దిక్ పటేల్ ఎదిగారు. హార్దిక్‌పై దేశద్రోహం నేరం మోపి జైల్లో పెట్టడం, గుజరాత్‌లోకి ప్రవేశించకుండా కోర్టు ఆర్నెల్లు నిషేధం విధించడంతో.. పటీదార్లు బీజేపీపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
ఉద్యమ ఉధృతి తగ్గినా.. పటీదార్లు రిజర్వేషన్ల కోసం తమ డిమాండ్ నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అవకాశం కోసం వేచి ఉన్న వీరు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం నేర్పాలని బహిరంగంగానే చెబుతున్నారు. గుజరాత్ జనాభాలో పటీదార్లు 12 నుంచి 14 శాతం దాకా ఉంటారు. సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉన్న ఈ వర్గం బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉంది. ఇప్పుడు పటీదార్లలో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. çహార్దిక్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తోంది. గుజరాత్ పర్యటనకు వచ్చిన రాహుల్‌ను సోమవారం కలవాల్సిందిగా హార్దిక్‌ను కాంగ్రెస్ ఆహ్వానించింది. అయితే ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున ఇప్పుడు కలవలేనని, రాహుల్ తర్వాతి గుజరాత్ పర్యటనలో ఆయన్ని కలుస్తానని హార్దిక్ తెలిపారు.
పార్టీలో చేరడం కుదరకపోతే.. ఎన్నికల్లో మద్దతు తెలపాలని, కలసి పనిచేయాలని కాంగ్రెస్ కోరుతోంది. ప్రస్తుతం ఉన్న 49 శాతం రిజర్వేషన్ల జోలికి వెళ్లకుండా.. తాము అధికారంలోకి వస్తే తమిళనాడు తరహాలో పటీదార్లతో కలిపి ఇతరులకు అదనంగా 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్‌లో చేరి తనకంటూ ఉన్న ప్రత్యేక గుర్తింపును కోల్పోయే బదులు.. సామాజికవర్గ ప్రయోజనాల కోసం పాటుపడుతూ ఉద్యమ నేతగా ఉండేందుకే హార్దిక్ మొగ్గుచూపుతున్నారు. పటీదార్లను అవమానించిన బీజేపీని ఓడించేందుకు కృషి చేస్తానంటున్నారు.
బీజేపీకి భంగపాటు..
హార్దిక్ పటేల్‌ను తమవైపు తిప్పుకోవడం సాధ్యం కాదని గ్రహించిన కాషాయ పార్టీ.. ఆయన్ని బలహీనపర్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. హార్దిక్‌కు సన్నిహితులుగా పరిగణించే వరుణ్ పటేల్, రేష్మా పటేల్‌ను శనివారం బీజేపీలో చేర్చుకుంది. వీరిద్దరూ హార్దిక్‌ను కాంగ్రెస్ ఏజెంట్‌గా అభివర్ణించారు. ఆదివారం పాస్ ఉత్తర గుజరాత్ కన్వీనర్ నరేంద్ర పటేల్‌ను అక్కున చేర్చుకుంది. బీజేపీలో చేరిన కొద్దిగంటల్లోనే ఆదివారం నరేంద్ర పటేల్ ప్రెస్‌మీట్ పెట్టి సంచలనం సృష్టించారు.
పార్టీలో చేరితే రూ.కోటి ఇస్తా మని బీజేపీ ప్రలోభ పెట్టిందని, అడ్వాన్సు గా రూ.10 లక్షలు ఇచ్చిందని.. ఆ నగదును మీడియా ముందు ప్రదర్శించారు. దీంతో బీజేపీ ఒక్కసారిగా అవాక్కయ్యింది. ఇది కాంగ్రెస్ డ్రామాగా కొట్టిపారేసే యత్నం చేసింది. కొద్దిగంటల్లోనే 15 రోజుల కిందట బీజేపీ తీర్థం పుచ్చుకున్న పటీదార్ ఉద్యమనేత నిఖిల్ సవానీ.. బీజేపీ ప్రలోభాలకు నిరసనగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. రాహుల్ అపాయింట్‌మెంట్ కోరతానన్నారు. హార్దిక్ ముఖ్య అనుచరులను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ ఆకర్‡్ష చేపట్టిన బీజేపీ అనూహ్యంగా ఇది బెడిసికొట్టి.. తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment