
ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఉత్తర బహుగుణ
డెహ్రాడూన్ : తనకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్న ఓ మహిళా ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌తో వాగ్వాదం పెట్టుకుందనే కారణంతో ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్ ఉత్తర బహుగుణను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మారుమూల ప్రాంతానికి బదిలీ చేసిన తనను డెహ్రాడూన్ నగరానికి మార్చాలని కోరుతూ ఆమె సీఎం జనతా దర్బార్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రావత్‌తో ఆమె తీవ్రంగా వాగ్వాదం చేస్తున్నట్టు ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వాగ్వాదం కారణంగానే రావత్ ఆమెపై చర్యలు తీసుకున్నారని అంటున్నారు. అనుమతి లేకుండా సీఎం కార్యక్రమానికి హాజరై ఆయనతో అమర్యాదగా ప్రవర్తించిందనే కారణంతో ప్రిన్సిపాల్ ఉత్తర బహుగుణను ఉత్తరాఖండ్ విద్యాశాఖ సస్పెండ్ చేసింది.
ఈ వ్యవహారంలో ప్రిన్సిపాల్ ఉత్తర బహుగుణకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది. ఈ వ్యవహారంలో సీఎం రావత్, విద్యాశాఖ చర్యలకు నిరసనగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసారు. ఉత్తర బహుగుణ మీద వేసిన సస్సెన్షన్ ఆర్డర్‌లను వెంటనే వెనక్కితీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రీతం సింగ్ మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి రావత్ రాజులాగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు బీజేపీని ఎన్నుకున్నది వారికి సేవ చేయడానికి మాత్రమే. కానీ ప్రజలు తమ బాధలు చెప్పకోడానికి వెళ్తే సీఎం వారిని దగ్గరకు కూడా రానీయకుండా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం తక్షణమే ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఉత్తర బహుగుణ మీద జారీ చేసిన సస్పెన్షన్ ఆర్డర్‌ను ఉపసంహరించుకోవాలి. ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. అలా చేయకపోతే ప్రభుత్వ చర్యలకు నిరసనగా జులై 1 న గాంధీ పార్క్‌లో ఒక రోజు నిరసన చేస్తామ’ని తెలిపారు.
అంతేకాక ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చిన సీఎం భార్య సునీత రావత్ బదిలీ వ్యవహారాన్ని ఉటంకిస్తూ ‘మన రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ నీతిని పాటిస్తుంది. తమ కుటుంబ సభ్యులకు, బీజేపీ ఎంపీలకు, నేతలకు ఒకరకమైన నియమాలను...సామాన్య ప్రజలకు ఒక రకమైన నియమాలను అమలు చేస్తుంద’ని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment