
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల పోరుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల కోసం 32 జిల్లాలకు రాష్ట్ర సమన్వయకర్తలను నియమించారు. ఇందులో భాగంగా డీసీసీ అధ్యక్షులను, సమన్వయకర్తలను జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఆదేశించారు.
16, 17 తేదీల్లో స్థానిక నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి మండల ప్రాదేశిక, జిల్లా ప్రాదేశిక అభ్యర్థుల నియామకాలపై చర్చలు జరపాలని సూచించారు. 18వ తేదీన 32 జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి తుది అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని, 19వ తేదీన తుదిజాబితాను టీపీసీసీకి నివేదించాలని స్పష్టం చేశారు.