డుమ్కా (జార్ఖండ్): కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పౌరసత్వ(సవరణ) చట్టంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, దేశంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆదివారం జార్ఖండ్‌లోని డుమ్కాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. అగ్నికి ఆజ్యం పోస్తున్న వారిని వారి దుస్తుల ఆధారంగానే గుర్తించవచ్చునని పార్టీ, సామాజిక వర్గాల పేర్లు నేరుగా ప్రస్తావించకుండా మోదీ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘ఆస్తులకు నిప్పు పెడుతున్న వారిని టీవీల్లో చూడవచ్చు. ధరించిన దుస్తుల ఆధారంగానే వారిని గుర్తు పట్టవచ్చు’అని ఆయన అన్నారు.
పౌరసత్వ(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలతోపాటు బెంగాల్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలన్నింటికీ ప్రతిపక్షాలు వ్యూహాత్మక సహకారం అందిస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. అయితే, కాంగ్రెస్ కుట్రలకు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ప్రభావితం కాలేదని అన్నారు. లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం ముందు కొందరు ప్రదర్శన నిర్వహించడంపై ఆయన.. ‘దేశం పరువు తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్ ఏళ్లుగా చేస్తున్న పనిని ఇప్పుడు కాంగ్రెస్ మొదటిసారిగా చేపట్టింది’ అని ఆరోపించారు. పార్లమెంట్‌లో ఎంపీలు సంతాలీ తదితర ప్రాంతీయ భాషల్లో మాట్లాడేందుకు అవకాశం కల్పించిన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభలో సంతాలీ భాష తర్జుమాకు కూడా వీలు కల్పించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment