
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని తాజా రాజకీయ పరిస్థితులపై కశ్మీర్‌పై ఏర్పాటైన కాంగ్రెస్ కోర్ గ్రూపు సోమవారం చర్చించింది. మాజీ ప్రధాని మన్మోహన్ నివాసంలో జరిగిన ఈ భేటీలో సీనియర్ కాంగ్రెస్ నేతలు కరణ్ సింగ్, చిదంబరం, గులాం నబీ ఆజాద్, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ అంబికా సోనీ, కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ గులాం అహ్మద్ మిర్‌లు పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నేతలతో మంగళవారం శ్రీనగర్‌లో చర్చలు జరపాలని భేటీలో నిర్ణయించారు. సమావేశం అనంతరం అంబికా సోనీని ‘పీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. ఊహాగానాలపై తాను స్పందించను’ అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌తో పొత్తుకు పీడీపీ రాయబారం?
కశ్మీర్‌లో కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పీడీపీ ప్రయత్నాలు చేస్తుందన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమేనని, ఆజాద్‌కు సీఎం చాన్స్ ఇచ్చేందుకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా వర్తమానం పంపినట్లు సమాచారం. కశ్మీర్‌లో పీడీపీకి 28, బీజేపీకి 25, నేషనల్ కాన్ఫరెన్స్‌కు 15, కాంగ్రెస్‌కు 12 మంది సభ్యుల బలముంది.
Comments
Please login to add a commentAdd a comment