
మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీలో ఉండాలి.. ఏ నేత పోటీ చేస్తే విజయావకాశాలున్నాయి..
సాక్షి, హైదరాబాద్: ‘మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీలో ఉండాలి.. ఏ నేత పోటీ చేస్తే విజయావకాశాలున్నాయి.. మీ అభిప్రాయంలో ఒక్క నాయకుడి పేరు చెప్పండి..’అంటూ క్షేత్రస్థాయిలోని కార్యకర్తల అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంది. ఫలానా నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తారనే అంశంపై రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా గత మూడ్రోజులుగా శక్తి యాప్ ద్వారా ఈ అభిప్రాయ సేకరణ జరిపారు. మొత్తం 4.5 లక్షల మందికి స్వయంగా ఆయన వాయిస్ మెసేజ్‌ను పంపగా, ఆదివారం సాయంత్రానికి 2.2 లక్షల మంది స్పందించి తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహు ల్ గాంధీ ఆదేశాల మేరకు ఆర్టిషీషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో ఏఐసీసీ డేటా అనాలసిస్ విభా గం ద్వారా ఈ అభిప్రాయ సేకరణ చేపట్టారు. బూత్ స్థాయి నాయకులతో పాటు గ్రామ స్థాయి లో చురుకుగా ఉండే నేతలను గుర్తించి ఈ వాయిస్ మెసేజ్‌లను పంపామని, అందులో ఒక్క పేరుతో వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
తుది జాబితా కేంద్ర కమిటీకి..
రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల అభ్యర్థుల తుది జాబితాను ఏఐసీసీ ఎన్నికల కమిటీకి అందజేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ముకుల్ వాస్నిక్‌కు కుంతియా ఈ జాబితా పంపారు. ఇది అక్కడి నుంచి రాహుల్ గాంధీకి చేరనుంది. ఆయన పరిశీలించి ఆమోదించిన తర్వాత తుది జాబితా ను అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, నవంబర్ 1లోపు కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకుని, పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను 1వ తేదీనే విడుదల చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉండటం గమనార్హం.
‘మాకూ ఆరు సీట్లివ్వండి’
తెలంగాణలో తాము కూడా బలమైన సామాజిక వర్గమని, తమకు ఆరుసీట్లు కేటాయించాలని తెలంగాణ కమ్మ సేవా సమితి కాంగ్రెస్ పార్టీని కోరింది. సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్. జి. విద్యాసాగర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆదివారం గోల్కొండ రిసార్ట్స్‌లో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్, టీపీసీసీ కోర్ కమిటీ సభ్యులు జానారెడ్డి, షబ్బీర్‌అలీలకు ఈ మేరకు వినతిపత్రం అందజేసింది. కమ్మ కులస్తులు రాష్ట్రంలో 16లక్షలకు మంది పైగా ఉన్నారని, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో గణనీయంగా ఉన్న తాము రాష్ట్రంలోని 35–40 స్థానాల్లో ప్రభావిత శక్తిగా ఉన్నామని తెలియజేశారు. మహాకూటమి ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్రంలోని 90% మంది కమ్మ కులస్తులు కాంగ్రెస్‌కు అండగా నిలుస్తారని, తాము మద్దతివ్వనప్పటికీ టీఆర్‌ఎస్ తమ కులస్తులకు ఆరు సీట్లు కేటాయించినందున కాంగ్రెస్ కూడా కనీసం 6 స్థానాలను తమ కులస్తులకు కేటాయించాలని కోరారు.