
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తేవడంతోపాటు పార్టీ కేడ ర్‌ను ఎన్నికల దిశగా సిద్ధం చేయడమే ఎజెండాగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘ప్రజా చైతన్య యాత్ర’(బస్సుయాత్ర) నేటి నుంచి ప్రారంభం కానుంది. 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్రను ప్రారంభించిన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచే ఈ యాత్ర కూడా మొదలుకానుంది.
యాత్ర రూట్ కూడా వైఎస్ పాదయాత్ర సాగిన మార్గంలోనే సాగనుంది. యాత్ర తొలిదశ మార్చి 8న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగియనుంది. ఈ యాత్ర కోసం పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. యాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు తాము అధికారంలోకి వస్తే చేయనున్న కార్యక్రమాలతో కూడిన మినీ మేనిఫెస్టోను కూడా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటిస్తారని పార్టీ వర్గాలంటున్నాయి.
యాత్ర సాగుతుందిలా...
సోమవారం ఉదయం 10 గంటలకు నాంపల్లి దర్గా వద్ద ప్రార్థనలు, 11 గంటలకు ఆరె మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, 12 గంటలకు మొయినాబాద్ చర్చి వద్ద ప్రత్యేక ప్రార్థనల తరువాత కాంగ్రెస్ నేతలు బస్సులో ఒంటిగంటకు చేవెళ్లకు చేరుకుంటారు. అక్కడ బస్సుయాత్ర తొలి బహిరంగసభ జరగనుంది. ఆ తర్వాత 4 గంటలకు వికారాబాద్‌లో జరిగే సభలో నేతలు ప్రసంగించనున్నారు.
రాత్రికి బస కూడా అక్కడే చేసి నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గ సమస్యలపై చర్చించనున్నారు. మంగళవారం ఉదయం వికారాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు తాండూరు, 4 గంటలకు సంగారెడ్డిలో ప్రజా చైతన్యయాత్ర జరగనుంది. అలాగే 28వ తేదీ ఉదయం సంగారెడ్డి నుంచి బయలుదేరి ఒంటిగంటకు జహీరాబాద్, 4 గంటలకు నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రాల్లో సభలు జరుగుతాయి. రాత్రి నారాయణఖేడ్‌లో నేతలు బస చేస్తారు.
ఆ తర్వాత మార్చి 1, 2, 3 తేదీల్లో బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. మార్చి 4న బోధన్ నియోజకవర్గం నుంచి యాత్ర మళ్లీ ప్రారంభం అవుతుంది. అదే రోజు నిజామాబాద్‌లో, 5న ఆర్మూరు, బా ల్కొండ నియోజకవర్గాల్లో, 7వ తేదీన నిర్మల్, మెట్‌పల్లి నియోజకవర్గాల్లో యాత్ర జరగనుంది. 8 ,9 తేదీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో యాత్రతో తొలిదశ పూర్తి కానుంది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అప్పటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు యాత్రకు విరామం ఇవ్వనున్నారు. ఆ తర్వాత నుంచి మే 15 వరకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పర్యటన సాగేలా టీపీసీసీ నాయకత్వం బస్సుయాత్రకు ప్రణాళికలు రూపొందించింది.