సాక్షి, చెన్నై : ద్రవిడ రాజకీయాల్లో చురుగ్గా తిరుగుతున్న ఎం. కరుణానిధికి కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని నిశ్చయించారు. చిదంబరంకు చెందిన ప్రముఖ గాయకుడు సుందరనార్ కూతురు పద్మావతిని ఖాయం చేశారు. 1944, సెప్టెంబర్‌లో పెళ్లి జరిగింది. అప్పటికే అభ్యుదయ భావాలు కలిగిన కరుణానిధి, ద్రవిడ ఉద్యమ స్ఫూర్తితో మంగళసూత్రం కట్టకుండా, పురోహితుడు లేకుండా వేదికపై దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. దాంతో కొత్త జీవితం ప్రారంభమైంది. 1924, జూన్‌లో జన్మించిన కరుణానిధికి 20 ఏళ్లు పూర్తిగా నిండలేదు. ద్రావిడ రాజకీయాల్లో 14వ ఏటనే ప్రవేశించిన ఆయన అప్పటికే నాటకాలు, కవిత్వం రాయడం ప్రారంభించారు. ఆత్మాభిమానం ఎక్కువగా కలిగిన కరుణానిధి తన కాళ్లపై తాను నిలబడాలనుకున్నారు. తాను అమితంగా ప్రేమించే భార్య కోసం సంపాదనామార్గం వెతుక్కోవాలనుకున్నారు.
ద్రావిడ నడగార్ కళగం (ద్రావిడ నటుల బృందం)తో నాటక రచయితగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ నాటకాల్లో కరుణానిధి కూడా నటించాలని వారు షరతుపెట్టారు. అందుకు అంగీకరించిన ఆయన తన ఇద్దరు మిత్రులతో కలిసి నాటకానికి నెల రోజుల ముందుగా వెల్లుపూర్ వెళ్లారు. అక్కడ వారు ముగ్గురు నాటక ట్రూప్ మేనేజర్ చూపించిన ఓ చిన్న గదిలో ఉన్నారు. తగిన రిహార్సల్స్ అనంతరం వారు ‘పళనియప్పన్’ నాటకాన్ని వేశారు. కొన్ని ప్రదర్శనలకు పెరియార్ రామస్వామి, అన్నా దురైలు వచ్చి నాటకాన్ని వీక్షించారు. అయినప్పటికీ ఆ నాటకం ఫ్లాప్ అయింది.
వెల్లుపూర్ అప్పటికే కులాల వారిగా విభజన చెంది ఉంది. అప్పుడే నాగపట్టినం నుంచి కూడా ఓ డ్రామా కంపెనీ వెల్లుపూర్ వచ్చింది. దానిపేరు ‘పరప్పసంగ’. అంటే పెరాయియార్ బాలలు అని అర్థం. షెడ్యూల్డ్ కులాలుగా పరిగణించే తమిళ దళితుల్లో పరాయార్లు, పెరాయియార్లు, అరుంధతియార్లు అంటూ మూడు ఉప కులాలు ఉన్నాయి. ఆ కులం వారు తప్పకుండా వీక్షించే విధంగా వారు నాటక సంఘానికి ఆ పేరు పెట్టుకున్నారు. ద్రావిడ ఉద్యమాన్ని విస్తరించేందుకు, తమ నాటకాలకు ప్రాచుర్యం కల్పించేందుకు ద్రావిడ అంటే దళిత ఉద్యమమని కూడా కరుణానిధి పేర్కొన్నారు.
అక్కడి నుంచి కరుణానిధి నాటక బృందం పాండిచ్చేరి వెళ్లింది. అక్కడ వారి నాటకం విజయవంతం అయింది. అక్కడ ఓ న్యాయవాది కోరిక మేరకు కరుణానిధి ‘తోజిలాలర్ మిత్రన్’ అనే తమిళ పత్రికలో ఓ వ్యాసం రాశారు. దానికి ‘దట్ పెన్’ అని పేరు పెట్టారు. శబర్మతి ఆశ్రమంలో జాతిపిత గాంధీజీ కోల్పోయిన పెన్ను ఆయన్ని, కాంగ్రెస్ పార్టీని విమర్శించినట్లుగా వ్యాసం రాశారు. అది కాంగ్రెస్ కార్యకర్తలకు ఆగ్రహం కలిగించింది. ఆ తర్వాత పాండిచ్చేరిలో ఏర్పాటు చేసిన ద్రావిడ సభలో కరుణానిధితోపాటు పెరియార్ రామస్వామి, అన్నాదురై, తదితర ద్రవిడ నేతలు పాల్గొన్నారు. ఆ సభకు హాజరైన అశేష జనవాహిణిలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పొల్గొని ‘ద్రావిడియన్ లీడర్స్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు.
అన్నాదురై మైకుపట్టుకొని మాట్లాడుతూ పిలువడం తమిళుల సంస్కృతి అని, పొమ్మనడం కాదని హితవు చెప్పారు. ఇంతలో వేదిక సమీపంలో ద్రావిడ జెండాను ఎగురవేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ జెండాను విరిచేశారు. వేదికను ధ్వంసం చేశారు. ద్రావిడ నాయకులను కార్యకర్తలు అక్కడి నుంచి తప్పించి పరిచయస్తుల ఇళ్లలో దాచారు. తనపై దాడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను తప్పించుకుంటూ కరుణానిధి పరుగెత్తారు. ఈ క్రమంలో ఆయన తన బృందం నుంచి వేరుపడి ఒంటరి వాడయ్యారు. ఎవరైనా తనను ఆదుకుంటారేమోనని చూశారు. అలాంటి పరిస్థితి కనిపించలేదు. తాను పరుగెత్తి అలసిపోతున్న సమయంలో ఓ ఇంటి తలుపులు తెరచి ఉండడం, ఆ ఇంటి ముందు ఇద్దరు మహిళలు నిలిచి ఉండడం కనిపించింది. ఆ మహిళలు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. గుడ్డిగా ఆ ఇంటిలోకి పరుగెత్తారు. వెన్నంటే వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు కరుణానిధిని బయటకు ఈడ్చుకొచ్చి చితకబాదారు. ఆయన స్పృహతప్పి పోయారు. చనిపోయారనుకొని అతన్ని పక్కనే ఉన్న కాల్వలో పడేసి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లిపోయారు.
రెండు గంటల తర్వాత మురికి కాల్వలో పడి ఉన్న కరుణానిధికి స్పృహ వచ్చింది. ఆందోళనతో ఆయనవైపు చూస్తున్న ఓ మధ్య వయస్కురాలు, ఓ యువతి కరుణానిధిని కాల్వలో నుంచి బయటకుతీసి ఇంట్లోకి తీసుకెళ్లారు. స్నానం చేయించి శుభ్రమైన బట్టలిచ్చి ఓ రిక్షా ఎక్కించి మరి పెరియార్ ఇంటికి పంపించారు. అక్కడ అప్పటికే కరుణానిధి కోసం పెరియార్, అన్నాదురైలు ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. కరుణానిధి గాయాలకు ప్రథమ చికిత్స చేసిన పెరియార్ తన వెంట రావాల్సిందిగా కరుణానిధిని తీసుకెళ్లారు. అక్కడే ఆయన తదుపరి యాత్ర ప్రారంభమైంది. ఈరోడు నుంచి వెలువడుతున్న పరియార్ మాగజైన్ ‘కుడియారసు’లో కరుణానిధి అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరారు. అక్కడ ఏడాదిపాటు మాగజైన్‌కు వ్యాసాలు, కథలు రాస్తూ గడిపారు. అప్పటికే కోయంబత్తూరులో ప్రసిద్ధి చెందిన చలనచిత్ర నిర్మాణ సంస్థ ‘జూపిటర్ ఫిల్మ్స్’ నుంచి పిలుపు వచ్చింది. ఆ విషయాన్ని కరుణానిధి, పెరియార్‌కు తెలిపారు. ఆయన వెన్నతట్టి పంపించారు. అక్కడే కరుణానిధి జీవితం మరో మలుపు తిరిగింది. 1947లో విడుదలైన ‘రాజకుమారి’ చిత్రానికి కరుణానిధి తొలిసారిగా స్క్రీన్ ప్లే రాశారు. అలా అయన తన జీవితకాలంలో 39 సినిమాలకు స్క్రీన్‌ప్లే అందించారు.
1969లో తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన కరుణానిధి మొత్తం ఐదు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన రాజకీయ జీవితంపై వచ్చిన ‘ఏ లైఫ్ ఇన్ పాలిటిక్స్’ అనే పుస్తకంలోని అంశాలే ఇవి. సంధ్యా రవిశంకర్ రాసిన ఈ పుస్తకాన్ని హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురించింది. ఇటీవలే విడుదలైన ఈ పుస్తకం 479 రూపాయలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment