
యువతిపై దాడి చేస్తున్న పోలీస్
లక్నో: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరి యువతుల పట్ల పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. కనీసం అమ్మాయిలన్న విషయం గుర్తించకుండా మగ పోలీసులే వారిని జుట్టు పట్టి మరి ఈడ్చిపడేశారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాలు యోగి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఉత్తర ప్రదేశ్ పర్యటనలో భాగంగా అలహాబాద్‌కు బయలు దేరిన అమిత్ షా కాన్వాయ్‌ని ఇద్దరు యువతులు నల్ల జెండాలతో ‘అమిత్ షా గో బ్యాక్ అంటూ’ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని ఈడ్చిపడేశారు. అంతేకాకుండా వారిపై లాఠితో దాడి చేసి జట్టు పట్టి మరి బలవంతంగా జీపు ఎక్కించారు. అయితే మగ పోలీసులే యువతులను లాగేయడం ఏమిటని, మహిళా పోలీసులు ఏమయ్యారని, కీలక నేత పర్యటిస్తున్నప్పుడు మహిళా పోలీసులు లేకుండా ఎలా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో అసలు యూపీలో మహిళా పోలీసులే లేరా? అని సెటైర్లు కూడా వస్తున్నాయి.
ఈ ఘటన పట్ల సమాజ్ వాదీ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ సునిల్ సింగ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బేటీబచావో బేటీ పడావో’ అంటే ఇదేనా అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఘటనతో మహిళల పట్ల ప్రభుత్వ విధానం ఎమిటో బహిర్గతమైందన్నారు. చట్ట ప్రకారం యువతులను మహిళా పోలీసులు అదుపులోకి తీసుకోవాలి. కానీ ఇక్కడ మగ పోలీసులే రెచ్చిపోయారని, ఈ విషయంలో సమాధానం చెప్పడానికి ప్రభుత్వం భయపడుతుందన్నారు. ఈ ఘటనకు కారణమైన భద్రతా అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అత్యంత దారుణమైన ఘటనని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అన్షూ అవాస్థి అభిప్రాయపడ్డాడు. దీనికి కారణమనై అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment