
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి నేతలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) నిబంధనలు ఆయాచిత వరంగా కలిసి వస్తున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు ఆయా ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదైన వారికి పరిషత్ బరిలో పోటీకి ఎస్‌ఈసీ నిబంధనలు అవకాశం కల్పిస్తున్నాయి. గతంలో జీహెచ్‌ఎంసీ, ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో కార్పొరేటర్లుగా, కౌన్సెలర్లుగా బరిలో దిగిన వారితోసహా వివిధ మున్సిపాలిటీలలో పోటీచేసి మున్సిపల్ చైర్మన్ పదవులు అనుభవించిన వారు సైతం మళ్లీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో, కొత్తగా ఏర్పడిన జిల్లాల పరిధి లో వివిధ పార్టీల నేతలు స్థానిక పదవులకోసం పావు లు కదుపుతున్నారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్, మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవులపై కన్నేశారు.
ఈ విధంగా తమ ఓటు పట్టణ ప్రాంతం నుంచి గ్రామీణ ప్రాంతానికి మార్చుకోవడం సాంకేతికంగా తప్పేమి లేకపోయినా, నిబంధనలు కల్పించిన అవకాశంతో అటు మున్సిపాలిటీల్లో, ఇటు జిల్లా, మండల పరిషత్‌లో చక్రం తిప్పే అవకాశం జిల్లా, మండలస్థాయి నేతలకు కలుగుతోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎంతో ముందుగానే జెడ్పీపీలు మొదలుకుని ఎంపీటీసీల వరకు ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. దీంతో పరిషత్ పదవుల ఆశావహులంతా పరిషత్ రిజర్వేషన్లకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. దీనికి అనుగుణంగా తమ ఓటును పట్టణ, మున్సిపల్ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు మార్చుకున్నారు. అంతేకాకుండా గతంలో ఉమ్మడి జిల్లాల్లో జెడ్పీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన వారు, జిల్లాల పునర్విభజనతో తమ ఓటును మరోచోటికి మార్చుకుని అక్కడి జెడ్పీ పీఠంపై కన్నేశారు. తమ తమ రిజర్వేషన్లను బట్టి ఆయా జెడ్పీటీసీ స్థానాలను ఎంచుకుని పోటీకి సిద్ధపడుతున్నారు.
►మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి గతంలో మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మీర్‌పేట ఎంపీటీసీగా పోటీచేసి ఓడారు. 2016లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆర్‌కేపురం కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు తమ ఓటును మున్సిపాలిటీకి మార్చుకున్నారు. తాజాగా మళ్లీ జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఓటును గ్రామీణ ప్రాంతంలోకి మార్చుకున్నారు.
►ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన భూపాలపల్లి డీసీసీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి 2006లో జరిగిన వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేశారు. తాజాగా వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. దీని కోసం మళ్లీ గ్రామీణ ప్రాంతంలో ఓటును నమోదు చేసుకుని పోటీకి సిద్ధమయ్యారు.
►రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న భూపతిగళ్ల మహిపాల్ స్వస్థలం ఆదిబట్ల. ఇది ఇటీవల పురపాలికగా మారింది. తాజాగా మండలంలోని చర్లపటేల్‌గూడ గ్రామ ఓటరుగా మారారు.
►ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి.. తాజాగా కోట్‌పల్లి జెడ్పీటీసీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఈ స్థానం వికారాబాద్ జిల్లా పరిధిలోకి వస్తుండడంతో ఆమె యాలాల మండలంలో ఓటరుగా చేరారు. గతంలో ఆమెకు షాబాద్ మండలంలో ఓటు హక్కు ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment