బీజేపీ, ఆరెస్సెస్‌కు అడ్డుకట్ట వేద్దాం!  | CPI Leader D Raja Interview With Sakshi | Sakshi
Sakshi News home page

బీజేపీ, ఆరెస్సెస్‌కు అడ్డుకట్ట వేద్దాం! 

Published Mon, Aug 26 2019 3:17 AM | Last Updated on Mon, Aug 26 2019 5:01 AM

CPI Leader D Raja Interview With Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం దేశానికి బీజేపీ, ఆరెస్సెస్‌ల నుంచి తీవ్రమైన సవాళ్లు ఎదురవుతున్నా యని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పేర్కొన్నారు. బీజేపీ పాలనలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలపై మూకదాడులు, హత్యలు వంటివి నిత్యకృత్యంగా మారడం ఆందోళనకరమన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆరెస్సెస్‌ ముందుండి ప్రభుత్వాన్ని నడిపించడంతోపాటు.. కేత్రస్థాయి కేడర్‌ను ‘మిలిటరైజేషన్‌’ చేసే దిశగా చర్యలు చేపడుతోందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ, ఆరెస్సెస్‌లపై పోరుకు విస్తృతస్థాయిలో అన్ని లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష శక్తులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడిందన్నా రు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాక తొలిసారి నగరానికి వచ్చిన సందర్భంగా రాజాతో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు.. 

దేశప్రయోజనాల దృష్ట్యానైనా.. 
లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే నేతృత్వంలో కాంగ్రెస్, వామపక్ష, ఇతర ప్రజాస్వామ్య పార్టీలన్నీ ఐక్యతతో పోటీచేసి సత్ఫలితాలు సాధిం చాయి. యూపీ, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో విపక్షాల మధ్య ఐక్యత సాధ్యం కాకపోవడంతో బీజేపీ, భాగస్వామ్యపక్షా లు లాభపడ్డాయి. దీనినుంచి అన్ని లౌకిక, ప్రజాతంత్రశక్తులు పాఠం నేర్చుకోవాల్సి ఉంది. బీజేపీ, ఆరెస్సెస్‌లకు వ్యతిరేకంగా ఎన్నికలకు ముందే అన్నిపార్టీలు ఒకే వేదికపైకి రావాలని సీపీఐ కోరినా అది సాధ్యపడలేదు. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రజల అవసరాలను దృష్టిలోపెట్టుకుని దూరదృష్టితో ఆలోచించాల్సిన అవసరముంది. అన్ని సెక్యులర్, ప్రజాస్వామ్య పార్టీలన్నీ కూడా వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలి. సీట్ల సర్దుబాటు తదితర అంశాల్లోనూ ఇదే వైఖరితో ముం దుకు సాగితే సమస్యలుండవు. బీజేపీ, ఆరెస్సెస్‌ ఓటమి ప్రధానలక్ష్యంగా విపక్షాలు సర్దుబాటు ధోరణితో పనిచేయాలి. ఈ నేపథ్యంలో జాతీయస్థాయిలో వామపక్షాల పాత్ర కీలకంగా మారింది. 

ముందుగా మా పార్టీ పునర్‌వ్యవస్థీకరణ 
ముందుగా మా పార్టీని అన్నిస్థాయిలో పునర్వ్యవస్థీకరించి క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలి.నిత్యం ప్రజాసమస్యలపై పోరాడేందుకు సిద్ధం చేయాలి. వామపక్ష, కమ్యూనిస్టు శక్తుల ఐక్యత, పునరేకీకరణ తక్షణ అవసరం. ఈ విషయాన్ని సీపీఐ ఎప్పుడూ ప్రస్తావిస్తూ అందుకోసం యతి్నస్తోంది. సైద్ధాంతిక ప్రాతిపదికన వామపక్ష ఐక్యత ను కోరుకుంటోంది. కమ్యూనిస్టు ఉద్యమం బలోపేతానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. 

‘లెఫ్ట్‌’ ఐక్యత చారిత్రక అవసరం 
కమ్యూనిస్టు పార్టీల ఏకీకరణకు సంబంధించి గతంలో సీపీఐ ప్రధానకార్యదర్శి ఇంద్రజిత్‌గుప్తా, సీపీఎం ప్రధానకార్యదర్శి హరికిషన్‌ సూర్జిత్‌ సమావేశమై ఒక జాయింట్‌ సర్క్యులర్‌ను విడుదల చేశారు. రాష్ట్రస్థాయిల్లోని ఉమ్మడి కమిటీలను ఏర్పాటు చేసి వామపక్ష ఐక్యతసాధన దిశలో చర్య లు చేపట్టాలని సూచించారు. అయితే ఈ ప్రక్రియ ఆ తర్వాత కొనసాగలేదు. వామపక్ష, కమ్యూనిస్టుల ఐక్యత, పునరేకీకరణ నేటి అవసరం. 

జెండర్, జనరేషన్‌ గ్యాప్‌ అధిగమించాలి 
పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసి యువత, మహిళల ప్రాతినిధ్యం పెంచడం.. తగిన శిక్షణనివ్వడం ద్వారా సామాజిక మార్పుకు వారథులుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దళితులు, ఆదివాసీలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల్లో చైతన్యం పెరిగింది. వీరికి కమ్యూనిస్టులు దగ్గరకావాల్సి ఉంది. వీరిలో చురుకైన కేడర్‌ను పారీ్టలో భాగస్వాములను చేయాలి. జెండర్, జనరేషన్‌ గ్యాప్‌ను అధిగమించాల్సి ఉంది. 

సోషల్‌మీడియా సెల్‌ ఏర్పాటు.. 
సీపీఐ జాతీయస్థాయిలో ఒక సోషల్‌మీడియా సెల్‌ను ఏర్పాటుచేసింది. రాష్ట్రస్థాయిల్లోనూ దీనిని ఏర్పాటుచేయాలని సూచించాము. బీజేపీ ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగట్టడంతో పాటు, ముఖ్యమైన అంశాలపై పార్టీ వైఖరిని వివరించేందుకు ఈ మాధ్యమాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర పార్టీలకు తెలియజేశాం.  

కాంగ్రెస్‌ విధానాలు మారాలి 
దేశవ్యాప్తంగా ఉనికి ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఎలా వ్యవహరిస్తుందనేది కీలకంగా మారింది. ప్రస్తుతం ఆ పార్టీలోనే ఇబ్బందికరపరిస్థితులు తలెత్తడం, కాంగ్రెస్‌ నేతలు భిన్నాభిప్రాయాలతో పార్టీ అధికారిక వైఖరిని విభేదిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ తన సొంత విధానాల్లో కొన్నిం టిని వదులుకోవాలి. దేశప్రయోజనాల కోసం కొన్ని విధానాలను మార్చుకుని ముందుకు తీసుకెళ్లాలి. సెక్యులర్‌ విలువల పరిరక్షణకు పెద్దపీట వేసి, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ, తదితర అంశాల్లో మార్పులు చేపడితే ప్రయోజనం ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement