ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పక్కన శ్రీనివాసరావు
చిత్తూరు, మదనపల్లె: ‘నారావారిపల్లె సీఎం జాగీరా...? ముఖ్యమంత్రి మా ఊర్లకు రావచ్చు కానీ మేం వాళ్ల ఊరికి వెళ్లకూడదా...? రాష్ట్రంలో చంద్రబాబు పోలీసులతో పరిపాలన చేయాలనుకుంటే ఎంత మాత్రం సహించేది లేదు’ అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు చేపట్టిన బస్సు జాత మంగళవారం సాయంత్రం మదనపల్లెకు చేరుకుంది. రామకృష్ణ మాట్లాడుతూ నారావారిపల్లె ఆస్పత్రిలో వైద్యులు లేరన్న విషయమై పరిశీలించేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డు చెప్పడం దారుణమన్నారు. ప్రధాని మోదీ నోట్ల రద్దు, జీఎస్టీతో 2,64,000 పరిశ్రమలు మూతపడేలా చేసి 96 లక్షల మందిని నిరుద్యోగులు చేశారన్నారు.
నిత్యావసరాల ధరలు తగ్గించకపోగా భారం మోపుతున్నారని తెలిపారు. చంద్రబాబు మళ్లీ రావాలని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు మద్యం, ఇసుక, మైనింగ్, రియల్ ఎస్టేట్ పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రతిరోజూ టీవీలో కనిపించడం తప్ప ఏరోజైనా మదనపల్లెలో కరువు, టమాట రైతుల సమస్యలపై మాట్లాడారా అని ప్రశ్నించారు. వామపక్షాలు, జనసేన, లోక్‌సత్తా, ఆమ్‌ఆద్మీ, సారూప్యత కలిగిన పార్టీలతో ప్రత్యామ్నాయ రాజకీయాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. సీపీఎం కేంద్ర కార్యవర్గ సభ్యులు శ్రీని వాసరావు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ, రాష్ట్రం లో చంద్రబాబు అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు తప్ప సామాన్యులకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రమాదేవి, సీపీఐ రాష్ట్ర మహిళా సమాఖ్య కార్యదర్శి జయలక్ష్మి, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మాల్యాద్రి, లెనిన్, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు రామానాయుడు, చల్లా వెంకటయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment