
సాక్షి, యాదాద్రి : కేసీర్‌కు దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు సవాల్ విసిరారు. సోమవారం ఆయన భువనగిరిలో మాట్లాడుతూ.. ఓట్లకోసమే పాలకులు పథకాలు ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. పేదలకు అందించాల్సింది ఓట్ల పథకాలు కాదని వారికి ఉపయోగపడే పథకాలు ప్రవేశపెట్టాలనివ్యాఖ్యానించారు. పేదలకు ఇస్తామన్న డబుల్ బెడ్‌రూం, మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, నరేంద్ర మోదీలకు ప్రజాగోడు పట్టదని ఆరోపించారు.
తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీల లెక్కలు లేవనడం భూటకమని ఆరోపించారు. సమగ్ర సర్వే లెక్కలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీసీల జనాభా ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సామాజిక ఎజెండాతో ముందుకెళ్తున్నది బీఎల్‌ఎఫ్ మాత్రమేనని పేర్కొన్నారు. ఓటర్ల చైతన్యం కోసం జులై 15న హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు.