
‘డబుల్’పై కార్యాచరణ రూపొందించాలి
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి నిర్దిష్టమైన కాలవ్యవధితో కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఎం విజ్ఞప్తి చేసింది.
రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఎం లేఖ
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి నిర్దిష్టమైన కాలవ్యవధితో కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఎం విజ్ఞప్తి చేసింది. రెండున్నరేళ్లు గడిచినా డబుల్ బెడ్‌రూం ఇళ్ల హామీ అమలుకు నోచుకోలేదని తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం లేఖ రాశారు. ఈ ఇళ్ల విషయంలో ప్రజలను మోసం చేస్తూ కాలం వెళ్లదీయవద్దని సూచించారు.
సీపీఎం ఆధ్వర్యంలో చేపడుతున్న మహాజనపాదయాత్రలో.. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లుల సమస్యపై పెద్దమొత్తంలో దరఖాస్తులు అందుతున్నాయన్నారు. ఇందిరమ్మ పెండింగ్ బిల్లులు భారీగా పేరుకుపోయినందున, వాటిని చెల్లించాలని కోరారు. గత మూడేళ్లుగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పేదలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.