
టేక్మాల్(మెదక్): ‘కేసీఆర్ బట్టేబాజ్.. ఓ నియంత.. దగాకోరు.. మోసగాళ్లల్లో నంబర్‌వన్, అతను నోరు విప్పితే అన్నీ అబద్ధాలే’అని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విమర్శలు గుప్పించారు. శుక్రవారం మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండలం ఎల్లుపేటలో మెదక్ జిల్లా జేఏసీ కన్వీనర్ మామిడి సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చిన హమీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత కరెంట్, రుణమాఫీని అమలు చేసిందని గుర్తు చేశారు. మహిళలకు పావలా వడ్డీ రుణాలు అందించిందని పేర్కొన్నారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 58 ఏళ్లకే రూ.2 వేలు ఆసరా పింఛన్ అందిస్తామని, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని ఆయన హమీ ఇచ్చారు. కేసీఆర్ తన కుమారుడిని సీఎం చేసేందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.