దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌ను ఒక వర్గానికి చెందిన వారే ఏలుతున్నారని ఆ పార్టీ మాజీ నేత దానం నాగేందర్ పేర్కొన్నారు. ఆత్మగౌరవం లేని చోట కొనసాగడం వృథా అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను వీడేందుకు దారితీసిన పరిస్థితులను శనివారం ఆయన మీడియాకు వివరించారు. ‘‘30 ఏళ్లుగా పార్టీకి సేవ చేశా. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశా. సైనికుడిగా పనిచేసినప్పటికీ చాకిరీగా వాడుకున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న బీసీ నేతలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏ సమావేశం జరిగినా ఒక వర్గానికి చెందిన వారే వేదికపై ఉంటున్నారు. వారే మాట్లాడుతున్నారు. పార్టీలో బీసీ నేతలు, నాయకులకు అవకాశం లభించడం లేదు. సీనియర్లు డి.శ్రీనివాస్, కె.కేశవరావు పార్టీని వీడడానికి కారణాలేంటో తెలుస్తోంది. సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్యకు పార్టీలో ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదో చెప్పాలి. వీహెచ్‌ను కూడా పట్టించుకోవడం లేదు. ఆయన పార్టీలో మింగలేక.. కక్కలేక అన్నట్లు ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి చెప్పాను. ఆరు నెలల క్రితం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీ బీసీ నాయకులతో రాహుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి నేను కూడా హాజరయ్యా. అందులో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాను’’అని దానం చెప్పారు. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం రావాలంటే బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్‌కు సూచించినట్లు తెలిపారు.
ఉత్తమ్ పని బాగున్నా..
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పనితీరు బాగుందని, ఆయన పార్టీ కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని దానం పేర్కొన్నారు. కానీ కొందరు నేతలు ఉత్తమ్‌ను కిందకు లాగే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పోలీసు శాఖలో ఒక సామాజిక వర్గానికే పదోన్నతులు ఇచ్చారని, ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా అప్పటి హోంమంత్రి జానారెడ్డిని వైఎస్ వారించారన్నారు. కాంగ్రెస్‌లో ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తనకు తెలియకుండానే టికెట్లు ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గ్రేటర్‌లో ఏ కార్యక్రమం జరిగినా.. బాధ్యతనంతా నా భుజాలపైనే వేసుకుని పని చేశా. కానీ నన్ను విస్మరించారు. పార్టీలో అన్ని వర్గాలకు సమానత్వం లేదు. బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోవడం లేదు’’అని అన్నారు.
కేసీఆర్‌ను చూసి గర్వపడుతున్నా..
సీఎం కేసీఆర్‌ను చూసి గర్వపడుతున్నానని దానం పేర్కొన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ గతంలో ఏ పార్టీ చేయని విధంగా బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను చూసి పలువురు ఆకర్షితులవుతున్నారన్నారు. గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపలు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. రైతుబంధు, రైతుబీమాపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాలు బడుగుల కులాల్లో వెలుగులు నింపుతున్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌లో చేరే విషయంపై త్వరలో సమాచారం ఇస్తానని చెప్పారు. టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత తాను పదవులు ఆశించబోనన్నారు. ఎలాంటి కార్యాన్ని అప్పగించినా బీసీల సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment