హైదరాబాద్: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీఎన్జీవో), తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీవో) నేతలతో సీఎం కేసీఆర్ భేటీని కాంగ్రెస్ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఖండించారు. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు 50 వేల మంది సమ్మెలోకి దిగి రోడ్లెక్కితే (టీఎన్జీవో), (టీజీవో) ప్రతినిధులు సీఎం కేసీఆర్‌తో సమావేశాన్ని నిర్వహించడం ద్వారా ఉద్యోగుల హక్కుల్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఉద్యోగ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించడంలో ఔచిత్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సీఎంతో సమావేశం వెనుక ఏ ఉద్ధేశం ఉందో టీఎన్జీవో, టీజీవో నేతలు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్‌కు మద్దతు అంశంపై సీపీఐ పునరాలోచన చేయాలని సూచించారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విక్టరీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌కు ఘోర పరాభావం తప్పదని జోస్యం చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పుడు నుంచి ఆర్థికంగా మిగులుతో ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు రూ.2.70 లక్షల కోట్ల అప్పులున్నాయని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, రైతుబంధు, ఇతర కీలక పథకాలకు నిధుల లేమి పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అయితే, టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు ఆధారంగా ఓట్లు అడగడం లేదని, డబ్బుల పంపిణీ, మద్యం పారించడం ద్వారా హుజూర్‌నగర్‌లో గెలుపొందాలనే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకుల్ని పోలీసులు వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. పోలీసుల వాహనాల్లో టీఆర్ఎస్ పార్టీ పెద్ద మొత్తంలో డబ్బుల్ని తీసుకొచ్చిందని అన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా పనిచేస్తున్న పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్‌లు సస్పెండ్ అయ్యారని తెలిపారు. ఇప్పటికీ పలువురు ప్రభుత్వ ఉద్యోగులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment