
అధినేతతో కలసి పాదయాత్రలో బియ్యపు మధు, సిద్దాగుంట సుధాకర్‌రెడ్డి
రేణిగుంట: రేణిగుంట మండలం గాజులమండ్యంకు చెందిన డీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు సిద్దాగుంట సుధాకర్‌రెడ్డి బుధవారం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్రలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఆయనతో పాటు రేణిగుంట మాజీ సర్పంచ్ జ్యోతినారాయణ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రేణిగుంట మండలంలో ఇప్పటికే పార్టీ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో ఆయన చేరికతో మరింత బలం చేకూరింది. మండలంలో నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ తిరుపతి నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పన్నీరుకాల్వ శ్రీధర్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర నాయకులు కన్నలి మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment