
వేదికలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం పాత పద్ధతి. ఆన్‌లైన్‌లో ఓ పంచ్ డైలాగ్‌తో సెటైర్లు వేసుకోవడం కొత్త ఆనవాయితీ. ఈ ట్రెండ్‌కు తగ్గట్టు పార్టీలూ, నాయకులూ మారారు. స్మార్ట్‌ఫోన్లలోకి దూరి మరీ ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థిని తెలివిగా విమర్శించాలి. చేతగానితనాన్ని ఎత్తిచూపాలి. వీలైతే కళ్లకు కట్టినట్లు చూపాలి. అప్పుడే ఓటరు ప్రభావితమవుతాడు.
చేసింది చెప్పడం ఒక ఎత్తు.. చేయబోయేదీ చెప్పడం మరో ఎత్తు. మొత్తానికి దేన్నయినా ఎఫెక్టివ్‌గా చెప్పడానికి చేయాలెంతో కసరత్తు.. అందుకే, భాషపై పట్టున్న కంటెంట్ రైటర్లకు డిమాండ్ పెరిగింది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు విమర్శలకు పదును పెడుతున్నారు. ఆరోపణలకు సానబెడుతున్నారు. ప్రెస్‌మీట్లు, బహిరంగసభల్లో మంచి ప్రసంగాలు రాయించుకుంటున్నారు.
రాష్ట్రంలో 40 శాతానికి పైగా 20 నుంచి 40 ఏళ్ల యువ ఓటర్లున్నారు. వీరందరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లున్నాయి. అందుకే, తమ విమర్శలు, చేసిన ప్రచారం 24 గంటలూ అందరికీ చేరేలా పార్టీలు పలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. తమ విమర్శలకు మంచి కంటెంట్‌తో తయారైన సెటైర్లు, పంచ్‌లు, ప్రాసలతో ప్రత్యర్థులపై ఆన్‌లైన్‌లో మెరుపు యుద్ధానికి దిగుతున్నాయి.
నాయకులకు లక్షల్లో ఫాలోవర్లు!
తమ ప్రసంగాలను, విమర్శలను మంచి పదాలతో పొందుపరచడంతో పాటు, ఆ వీడియోలను ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో లైవ్‌లో అందుబాటులో ఉంచడం లేదా క్షణాల్లో అప్‌లోడ్ చేయడం, వాటికి గ్రాఫిక్స్ జోడించడం ఇపుడు సాధారణ విషయమైపోయింది. అందుకే, రాజకీయ నేతల ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాలను లక్షల మంది అనుసరిస్తున్నారు. అన్ని పార్టీలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలన్న నిబంధన విధించడంతో అభ్యర్థులు, ఆశావహులు ఖాతాలు తెరిచేశారు.
వీటి కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకుని, తమ ఫాలోవర్లు పెరిగేలా 24 గంటల పాటు ఈ ఖాతాలను నిర్వహిస్తున్నారు. వీటికి లైకులు కొట్టేందుకు, షేర్ చేసేందుకు కొందరు ప్రత్యేకంగా ఫేక్ ఫాలోవర్లు ఉంటారు. వీరికి రోజుకు రూ.200 నుంచి 400 వరకు చెల్లిస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసేదాకా ఫలానా నాయకుడు చేసిన ట్వీట్లను రీట్వీట్ చేయడం, కామెంట్ చేయడం, ఫేస్‌బుక్ పోస్టులను లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం వీరి పని. వీరు తమ సెల్‌ఫోన్ల ద్వారా షిప్టుల వారీగా నిరంతరం ఇదే పనిలో ఉంటారు. వీరిలో కొందరు రాత్రిపూట సైతం ‘ఆన్‌లైన్’ విధుల్లోనే ఉంటారు.
అన్ని పార్టీలదీ ‘సోషల్’ దారే!
రాజకీయ సోషల్ వార్ విషయంలో నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ముందుంది. వీటిని నడిపే వారిలో అధికశాతం కాంగ్రెస్ సానుభూతి పరులే. ఈ పార్టీ అధికారిక ఖాతాతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తన ఓటుబ్యాంకును కాపాడుకుంటోంది. ఈ క్యాంపెయిన్‌కు ఎన్నారైలూ బాసటగా నిలుస్తున్నారు.
ఈ విషయంలో టీఆర్‌ఎస్, బీజేపీ, టీజేఎస్ అందరిదీ ఒకటే లక్ష్యం. తమ సందేశం లక్షలాదిమంది యువతకు చేరాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఓటరుకు తమ వినతి అందాలన్న తాపత్రయంతో సోషల్ మీడియాపై నెలానెలా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇక, ఎవరికి వారు నిర్వహించుకుంటున్న వాట్సాప్ గ్రూపులు సరేసరి. ఫేస్‌బుక్, ట్విట్టర్ కంటే వాట్సాప్ పోస్టులు, షేరింగులే క్షణాల్లో చక్కర్లు కొడుతూ ఎక్కువ మందికి చేరుతున్నాయి.
ఈసీ దృష్టి సారించేనా..
పార్టీల సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ ఆషామాషీ కాదు. తెలుగు భాషపై, స్థానిక రాజకీయాలపై పట్టున్న కంటెంట్ రైటర్లకు ఒక్కొక్కరికి రూ.30 వేల నుంచి రూ.70 వేల దాకా ఇచ్చి రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ పనులను కొన్ని పార్టీలు నేరుగా చేస్తుంటే.. మరికొందరు సానుభూతిపరుల రూపంలో ఈ వ్యవహారాన్ని చక్కబెట్టేస్తున్నారు. పైగా నోటిఫికేషన్ వచ్చేవరకు వీటికి లెక్కలు చూపించాల్సిన పని లేదు. సోషల్ మీడియా ఖర్చులకు అభ్యర్థులు నామినేషన్ వేసేంత వరకు లెక్క చూపించనక్కర్లేదు. ఇదే అదనుగా చాలామంది ఆన్‌లైన్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు.
పంచ్..ప్రాస.. వైరల్
పార్టీలు పంచ్ కామెంట్లతో ఆకట్టుకునేందుకు పోటీపడుతున్నాయి. సినిమా సన్నివేశాల్లోని హీరో ముఖానికి తమ పార్టీ అధినేత ముఖాన్ని మార్ఫింగ్ చేసి, విలన్ల (పత్యర్థి)ను చితక్కొట్టినట్లు చెలరేగిపోతున్నారు. ప్రాసలతో పంచ్ డైలాగ్‌లు ఉంచుతున్నారు. వీటికి సంగీతం సమకూర్చి.. ఎడిటింగ్ చేయాలి. డైలాగులు తిరగ రాయాలి. అందుకే, కంటెంట్ రైటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, వీడియో ఎడిటర్లకు డిమాండ్ పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment